కశ్మీర్లో మే నెలలో రంజాన్ సందర్భంగా దాడులకు విఫలయత్నం చేసిన ఉగ్రవాదులు.. దేశంలో అల్లర్లకు మరోమారు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆర్టికల్ 370 రద్దు చేసి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ఆగస్టు 5న అయోధ్య రామ మందిర భూమి పూజ, జమ్ముకశ్మీర్ లక్ష్యంగా దాడులు చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం అందినట్లు స్పష్టం చేశాయి. స్వతంత్ర వేడుకలకూ ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు నిఘావర్గాలు చెబుతున్నాయి. పాకిస్థాన్ సైన్యం ద్వారా అఫ్గానిస్థాన్‌లోని జలాలాబాద్‌లో శిక్షణ పొందిన ముష్కరులు ఇందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
నిఘా వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు దిల్లీ, జమ్ముకశ్మీర్, అయోధ్యలో భద్రతను పటిష్ఠం చేశారు.
"పాకిస్థాన్ సైన్యం ద్వారా శిక్షణ పొందిన ఉగ్రవాదులు.. రంజాన్ ముగిసిన అనంతరం మే 26 నుంచి 29 మధ్య జమ్ముకశ్మీర్‌లో దాడులకు విఫలయత్నం చేశారు. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేయాలి."