అమెరికాలోని ఓ తెలుగు విద్యార్థికి అక్కడి న్యాయస్థానం 12 నెలల జైలు శిక్ష విధించింది. 27 ఏళ్ల విశ్వనాథ్ ఆకుతోట.. ఓ కళాశాలలో ఉద్దేశపూర్వకంగానే కంప్యూటర్ పరికరాలను ధ్వంసం చేసినట్టు తేలింది. ఈ కేసులో న్యూయార్క్ ఉత్తర జిల్లా న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. జైలు శిక్షతోపాటు 58,471 డాలర్లు (సుమారు రూ.42 లక్షలు) నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
అల్బానీ నగరంలోని సెయింట్ రోస్ కళాశాలలో ఫిబ్రవరి 14న 'యూఎస్బీ కిల్లర్' అనే పరికరాన్ని 66 కంప్యూటర్లకు, మరికొన్ని మానిటర్లకు అమర్చినట్టు విశ్వనాథ్ అంగీకరించాడు. ఆ పరికరం వల్ల కంప్యూటర్లలోని కెపాసిటర్లు అసాధారణ రీతిలో ఛార్జ్-డిశ్చార్జ్ అయ్యి... యూఎస్బీ పోర్ట్ దెబ్బతింది. వెంటనే విద్యుత్ వ్యవస్థ ధ్వంసమైంది.