పాక్ సైనిక పోస్టులను ధ్వంసం చేసిన భారత్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దాడులకు తెగబడుతున్న పాకిస్థాన్ సైన్యానికి గట్టి బదులిచ్చింది భారత సైన్యం. వాస్తవాధీన రేఖను అనుకొని ఉన్న ఏడు పాక్ సైనిక పోస్టులను ధ్వంసం చేసింది. ఈ దాడిలో పలుపురు పాక్ సైనికులు మృతి చెంది ఉండొచ్చని భారత అధికారులు తెలిపారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్లోని రాక్చక్రీ, రావల్కోట్ ప్రాంతాల్లోని పాక్ సైన్యం పోస్టులను ధ్వంసం చేసింది భారత సైన్యం.
బుద్ధి చెప్పేందుకే...
పాకిస్థాన్ గత రెండు రోజుల్లోనే అనేకసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ దళాలు సోమవారం కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో ఓ బీఎస్ఎఫ్ ఇన్‌స్పెక్టర్, స్థానిక బాలిక ప్రాణాలు కోల్పోయారు. 24 మందికిపైగా గాయపడ్డారు. మంగళవారం కూడా భారత సైనికులు, సరిహద్దు గ్రామాల ప్రజలే లక్ష్యంగా కాల్పులు జరిపాయి పాక్ బలగాలు. ఈ కాల్పుల్లో ఇద్దరు పౌరులు గాయపడ్డారు.
ఈ దాడులకు గట్టి సమాధానమిచ్చేందుకే పాక్ పోస్టులను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ ఘటనలో తమ సైనికులు ముగ్గురు చనిపోయారని పాకిస్థాన్ అధికారులు వెల్లడించారు.
పాఠశాలలకు సెలవు
పోస్టులను ధ్వంసం చేసినందుకు గాను పాక్ సైన్యం ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉందనే అంచనాతో భారత్ అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా పూంచ్, రాజౌరీ సెక్టార్లలో సరిహద్దు వెంబడి ఉన్న పాఠశాలలకు సెలవులు ప్రకటించారు అధికారులు.