తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాందహార్​' హైజాక్​.. జాతికి చేదు జ్ఞాపకం - militants news

ఇండియన్​ ఎయిర్​లైన్స్​కు చెందిన ఐసీ-814 విమానం హైజాక్​కు గురైన ఘటన భారత్​కు ఉగ్రముప్పు పెంచింది. పాకిస్థాన్​ ఆధారిత హర్కతుల్​ ముజాహిదీన్​ అనే ఉగ్రవాద సంస్థ అది తమ పనేనని ప్రకటించుకుంది. ఇస్లామిక్​ ఉగ్రవాదులు ముస్తాక్​ అహ్మద్​ జర్గర్​, మౌలానా మసూద్​ అజర్​, షేక్​ ఒమర్​లను భారత్​ విడుదల చేసిన తరువాత హైజాకింగ్​ ఘట్టం ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం వెర్రి తలలు వేయడానికి కారణమైన ఆ ఘటన జరిగి నేటికి ఇరవయ్యేళ్లు!

Indian Airlines
'కాందహార్​' హైజాక్​.. జాతికి చేదు జ్ఞాపకం

By

Published : Dec 24, 2019, 8:46 AM IST

నేపాల్‌ రాజధాని ఖాట్మండూలోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా దిల్లీ ఎయిర్‌పోర్టుకు బయలుదేరిన ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఐసీ-814 విమానం మార్గమధ్యంలోనే హైజాక్‌కు గురైన ఘటన భారత్‌కు ఉగ్రవాద ముప్పును పెంచింది. పాకిస్థాన్‌ నుంచి కార్యకలాపాలు నడిపే హర్కతుల్‌ ముజాహిదీన్‌ అనే ఉగ్రవాద సంస్థ అది తమ పనేనని ఆ తరవాత ప్రకటించుకుంది. ఇస్లామిక్‌ ఉగ్రవాదులు ముస్తాక్‌ అహ్మద్‌ జర్గర్‌ (ముస్తాక్‌ లత్రమ్‌), మౌలానా మసూద్‌ అజర్‌, షేక్‌ ఒమర్‌లను భారత్‌ విడుదల చేసిన తరవాత హైజాకింగ్‌ ఘట్టం ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం వెర్రి తలలు వేయడానికి కారణమైన ఆ ఘటన జరిగి నేటికి ఇరవయ్యేళ్లు!

దిల్లీకి బదులు..కాందహార్​లో

మొత్తం 188 మంది ప్రయాణిస్తున్న ఆ విమానం దిల్లీలో దిగడానికి బదులు హైజాకర్ల బారినపడి అమృత్‌సర్‌, లాహోర్‌, దుబాయ్‌ల మీదుగా నాడు తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌లో దిగింది. హైజాకర్ల డిమాండ్‌ మేరకు విడుదల చేసిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరు ఆ తరవాతి కాలంలో అరెస్టు కాగా, ఇద్దరు మాత్రం పాకిస్థాన్‌ కేంద్రంగా ఇప్పటికీ యథేచ్ఛగా భారత్‌పైకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తూనే ఉన్నారు. విడుదలైనవారిలో ముస్తాక్‌ అహ్మద్‌ జర్గర్‌- కశ్మీర్‌ కేంద్రంగా కొనసాగుతున్న మిలిటెంట్‌ మూకకు నాయకుడు. మరోవంక మసూద్‌ అజర్‌ ఆ తరవాతి ఏడాదే జైషే మహమ్మద్‌ సంస్థను ఏర్పాటు చేసి భారత్‌పై నేటికీ విషం చిమ్ముతున్నాడు. ఇక షేక్‌ ఒమర్‌ తరవాతి కాలంలో పాకిస్థాన్‌లో డేనియల్‌ పెర్ల్‌ అనే పాత్రికేయుడిని హతమార్చిన నేరంలో అరెస్టయ్యాడు. పాక్‌ ప్రభుత్వం అతడికి ఉరిశిక్ష ఖరారు చేసింది.

ఉగ్రవాదానికి కొత్త జీవం మసూద్​..

హైజాక్‌ ఘటన తరవాత ముస్తాక్‌ అహ్మద్‌ తెరవెనక్కి వెళ్ళిపోయాడు. అయితే మసూద్‌ అజర్‌ మాత్రం ఉగ్రవాదానికి కొత్త జీవం పోసి వెయ్యి తలలతో మన దేశంపై విషం వదులుతున్నాడు. కశ్మీర్‌లోనూ, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఆత్మాహుతి దాడులకు రూపకల్పన చేసిన భీతావహ చరిత్ర మసూద్‌ సొంతం. భారత పార్లమెంటుపైన, ‘జమ్ము కశ్మీర్‌’ అసెంబ్లీపైన ఆత్మాహుతి దాడుల వెనక వ్యూహకర్త కూడా మసూద్‌ అజహరే! హైజాక్‌ ఘటనకు ముందు జైల్లో ఉన్న మసూద్‌ను విడిపించేందుకు అతగాడి సోదరుడు యూసఫ్‌ విఫలయత్నం చేశాడు. నిజానికి భారత నిఘా అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించి సరైన విధంగా స్పందించి ఉంటే ఆ హైజాక్‌ జరిగేదే కాదు. ఉగ్రవాద కుట్రకు సంబంధించి తమకు అందిన సమాచారాన్ని నిఘా యంత్రాంగం తేలిగ్గా తీసుకుంది. మరోవంక అదే విమానంలో ప్రయాణం తలపెట్టిన ‘రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌’ (రా)కు చెందిన అధికారి కూడా తనకు అందిన సమాచారాన్ని తేలిగ్గా కొట్టిపారేశారు. ‘రా’ అధికారి భార్య ఆనాడు భారత ప్రధాని వాజ్‌పేయీ కార్యాలయంలో బాగా పలుకుబడిగల ఓ అత్యున్నతాధికారికి దగ్గరి బంధువు కావడం ఈ సందర్భంగా గమనార్హం. ఇంధనం నింపుకోవడం కోసం అమృత్‌సర్‌లో ఆగిన విమానంపై దాడి జరిపి హైజాకర్లను మట్టుపెట్టాలని ఆనాడు మిలిటరీని సిద్ధం చేశారు. కానీ, ఆ విమానంలో ‘రా’ అధికారి ప్రయాణిస్తున్న కారణంగా దాడికి దిల్లీ నాయకత్వం నుంచి అనుమతి లభించలేదు. ఇంధనం నింపుకోకుండానే గుట్టుచప్పుడు కాకుండా బయలుదేరిన ఆ విమానం నేరుగా పాకిస్థాన్‌లోని లాహోర్‌లో దిగింది. అటునుంచి అది దుబాయ్‌కి చేరి, ఆపై కాందహార్‌లో వాలింది.

జిహాదీ సంస్కృతిని విస్తరిస్తోంది..

తాలిబన్‌లకు ఐఎస్‌ఐతోనూ, కశ్మీరీ ఉగ్రవాద బృందాలతోనూ ప్రత్యక్ష సంబంధాలున్నాయి. మరోవంక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలన్నింటికీ ఆనాడు మసూద్‌ అజహర్‌ సమన్వయ సారథిగా వ్యవహరించేవారు. పాకిస్థాన్‌లోని వాయవ్య సరిహద్దు ప్రాంతం, బాలాకోట్‌లను కేంద్రంగా చేసుకొని కార్యకలాపాలు సాగించడం ద్వారా భారతీయ నిఘా సంస్థల దృష్టి పరిధినుంచి మసూద్‌ అజహర్‌ విజయవంతంగా తప్పించుకు తిరిగేవాడు. హైజాక్‌ ఘటన తరవాత ఏర్పాటు చేసిన జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ ప్రపంచవ్యాప్తంగా జిహాదీ సంస్కృతిని ప్రబోధిస్తూ విస్తరిస్తోంది. ఏడు రోజులపాటు కొనసాగిన ఆ హైజాక్‌ ఘటనలో 180కిపైగా ప్రయాణికులు నరకం అనుభవించారు. ఆనాడు హైజాక్‌ ద్వారా విడుదలైన మసూద్‌ ఇప్పటికీ చెలరేగుతూనే ఉన్నాడు. ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ తన అనుయాయుల ద్వారా భారత ఉపఖండంలో అశాంతిని ఎగదోస్తూనే ఉన్నాడు. మసూద్‌ అజహర్‌ను మట్టుపెట్టడమే లక్ష్యంగా ఇటీవల బాలాకోట్‌లో భారత సైన్యం మెరుపుదాడులు నిర్వహించింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా తీర్మానించేందుకు భారత్‌ చేసిన ప్రయత్నాలను చైనా ఎప్పటికప్పుడు నీరుగార్చింది. నిఘా వర్గాలు అందించే ఏ చిన్న సమాచారాన్నీ నిర్లక్ష్యం చేయకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఉద్బోధించిన ఘటన ఇది. కాందహార్‌ హైజాక్‌ ఘటనలో భద్రత బలగాల వైఫల్యం స్పష్టంగా విదితమైంది. ఆ ఘటననుంచి పాఠాలు నేర్చి మరింత నిబద్ధంగా, నిర్దుష్టంగా భారతీయ నిఘా, భద్రత వర్గాలు సమన్వయంతో ముందుకు కదలాల్సిన అవసరం ఉంది.

ఇదీ చూడండి: ఝార్ఖండ్​లో 'హేమంతం'.. కమలానికి ఎదురుదెబ్బ

ABOUT THE AUTHOR

...view details