కేంద్ర ఔషధ నియంత్రణ మండలి అనుమతి రాగానే ఆస్ట్రాజెనికా-ఆక్సఫర్డ్ వర్శిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ సరఫరాకు సిద్ధంగా ఉన్నట్లు సీరం ఇనిస్టిట్యూట్ అధినేత అదర్ పూనావాలా చెప్పారు. తమ వద్ద 4 నుంచి 5 కోట్ల డోసుల కొవిషీల్డ్ టీకాలు నిల్వ ఉన్నట్లు ఆయన తెలిపారు. భారత ప్రభుత్వం ఎన్ని డోసులు కావాలో చెబితే నిల్వ నుంచి పంపిణీ చేస్తామన్నారు.
2021 జులై నాటికి 30కోట్ల డోసుల కొవిషీల్డ్ టీకాను ఉత్పత్తి చేస్తామని పునావాలా వెల్లడించారు. కొవిడ్ టీకా పంపిణీ, పర్యవేక్షణ కూటమి కొవాక్స్‌లో భారత్ కూడా ఉందని ఆయన గుర్తుచేశారు. సీరమ్ సంస్థ ఉత్పత్తి చేసే టీకా డోసుల్లో 50శాతం భారత్‌కు, కొవాక్స్ కూటమికి ఏకకాలంలో కేటాయిస్తామని చెప్పారు. భారత్‌లో జనాభా చాలా ఎక్కువ కాబట్టి 5 కోట్ల డోసులను ముందుగా భారత్‌కే అందజేస్తామని స్పష్టంచేశారు.