గిల్గిత్-బాల్టిస్థాన్‌లో ఎన్నికల నిర్వహణకు పాకిస్థాన్ విడుదల చేసిన నోటిఫికేషన్‌పై భారత్ తీవ్రస్థాయిలో మండిపడింది. సైనిక ఆక్రమిత ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చేవిధంగా పాకిస్థాన్ చేపట్టే చర్యలు న్యాయపరంగా చెల్లవని భారత విదేశాంగశాఖ తేల్చిచెప్పింది.
"ఈ విషయంలో మా వైఖరి స్పష్టంగా ఉంది. జమ్ముకశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాల్లోని పూర్తి భూభాగం.. భారత్‌లోని అంతర్భాగం. అందువల్ల.. సైనిక ఆక్రమిత గిల్గిత్-బాల్టిస్థాన్‌లో పాకిస్థాన్ ఎలాంటి చర్యలు చేపట్టినా.. అవి న్యాయపరంగా చెల్లవు."
--- అనురాగ్ శ్రీవాస్తవ, భారత విదేశాంగశాఖ ప్రతినిధి.
గిల్గిత్- బాల్టిస్థాన్ అసెంబ్లీకి నవంబర్ 15న ఎన్నికలు నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ గురువారం ప్రకటించింది. ఇదివరకు వాయిదా పడ్డ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువరిస్తూ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ ఉత్తర్వులు జారీ చేశారు.