భారత్- రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి ఎగుమతుల నుంచి వచ్చే ఆదాయాన్ని పూర్తిగా పరిశోధనాభివృద్ధికే వెచ్చించాలని ఇరుదేశాలు నిర్ణయించినట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.
"బ్రహ్మోస్ క్షిపణులను ఎగుమతి చేయడం ద్వారా వచ్చే ఆదాయాన్ని 100 శాతం క్షిపణి అభివృద్ధికే ఖర్చు చేయడానికి భారత్, రష్యా అంగీకరించాయి. క్రూయిజ్ క్షిపణిని సాంకేతికంగా మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి ఇది ఉపయోగపడుతుంది."
-అధికార వర్గాలు
ఆసియా, లాటిన్ అమెరికాలోని నాలుగు దేశాలు బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. భూఉపరితలంతో పాటు జలాంతర్గాములు, ఓడల నుంచి ప్రయోగించగలిగే క్షిపణులను దక్కించుకోవడానికి ఆయా దేశాలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
వియత్నాం, ఫిలిప్పీన్స్, ఇండోనేసియా, మలేసియా, బ్రెజిల్, చిలీ, వెనెజువెలా వంటి దేశాలు ఇందుకోసం చర్చలు ప్రారంభించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆయా దేశాలతో భారత్కు ఉన్న సంబంధాల ఆధారంగానే ఎగుమతులు ఉంటాయని స్పష్టం చేశాయి. బ్రహ్మోస్ ఎగుమతి కోసం ఓ దేశంతో జరుపుతున్న చర్చలు ఈ ఏడాది చివరికి లేదా వచ్చే ఏడాదినాటికి కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
"ఎగుమతుల ప్రణాళికకు కొవిడ్-19 మహమ్మారి వల్ల భంగం వాటిల్లింది. ఫలితంగా ఈ ఒప్పందాలు ఆలస్యమవుతున్నాయి. ప్రస్తుతానికైతే గాల్లో నుంచి ప్రయోగించగలిగే బ్రహ్మోస్ క్షిపణి ఎగుమతులను అనుమతించడం లేదు."