తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత్​-నేపాల్​ స్నేహ వారథిగా చమురు పైప్​లైన్​'

భారత్​-నేపాల్ మధ్య నిర్మించిన చమురు పైప్​లైన్​ను ఇరు దేశాల ప్రధానులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంయుక్తంగా ప్రారంభించారు. రికార్డు సమయంలో పూర్తయిన ఈ పైప్​లైన్ ద్వారా నేపాల్ పౌరులకు సరసమైన ధరలకు చమురు ఉత్పత్త్తులు అందుతాయని ఉద్ఘాటించారు మోదీ.

'భారత్​-నేపాల్​ స్నేహ వారథిగా చమురు పైప్​లైన్​'

By

Published : Sep 10, 2019, 2:04 PM IST

Updated : Sep 30, 2019, 3:00 AM IST

'భారత్​-నేపాల్​ స్నేహ వారథిగా చమురు పైప్​లైన్​'

దక్షిణాసియాలోనే మొట్టమొదటి అంతర్ దేశ చమురు పైప్​లైన్​ నిర్మించిన ఘనత... భారత్​, నేపాల్​కు దక్కింది. బిహార్​లోని మోతీహరి నుంచి నేపాల్​లోని అమ్లేఖ్​గంజ్​ మధ్య ఏర్పాటుచేసిన 69 కిలోమీటర్లు పొడవైన పైప్​లైన్​ అందుబాటులోకి వచ్చింది. దిల్లీ నుంచి ప్రధాని నరేంద్రమోదీ, కాఠ్​మాండూ నుంచి నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రాజెక్టును కలిసి ప్రారంభించారు.

ఈ పైప్​లైన్ రాకతో నేపాల్​లో చమురు ధరలు తగ్గుతాయని, పౌరులకు సరసమైన ధరలకే పెట్రోల్ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు మోదీ.

"మన సంయుక్త కృషి ఉద్దేశం పౌరులకు లాభం జరగడం, వారు అభివృద్ధి చెందడం. అభివృద్ధి పథకాలు అనుకున్న సమయంలో పూర్తి కావడం మన రెండు ప్రభుత్వాల ప్రాథమిక ప్రాధాన్యాంశం. మోతీహరి-అమ్లేక్ గంజ్ పైప్​ లైన్​కు గతేడాది భూమి పూజ జరిగింది. దక్షిణాసియాలోనే తొలిసారి ఇరు దేశాలు చేపట్టిన ఒక పైప్​లైన్ రికార్డు సమయంలో పూర్తికావడం సంతోషకరమైన విషయం. పూర్తి చేసేందుకు పెట్టుకున్న లక్ష్యంలో సగం సమయంలోనే పూర్తయింది. ఈ పైపులైన్ ద్వారా 2 మిలియన్ టన్నుల శుద్ధ చమురు ఉత్పత్తులు సరసమైన ధరలకు నేపాల్​ పౌరులకు అందుతాయి."

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

1973 నుంచి భారత్ ట్యాంకర్ల ద్వారా నేపాల్​కు చమురు సరఫరా చేస్తోంది. 1996లో మోతీహరి ఇంధన పైప్​లైన్​కు ప్రతిపాదన వచ్చింది. 2014లో మోదీ కాఠ్​మాండూ పర్యటనలో ఒప్పందంపై కసరత్తు తుదిదశకు చేరుకుంది. 2015లో పైప్​లైన్​ నిర్మాణానికి ఇరు దేశాలు అంగీకరించాయి. 2015లో నేపాల్​లో భూకంపం నేపథ్యంలో నిర్మాణం వాయిదా పడింది. గతేడాది ఏప్రిల్​లో పనులు ప్రారంభమయ్యాయి.

ఇదీ చూడండి: 'విక్రమ్​' కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న ఇస్రో

Last Updated : Sep 30, 2019, 3:00 AM IST

ABOUT THE AUTHOR

...view details