తగ్గని కరోనా ఉద్ధృతి.. 'మహా'లో మరో 5వేల కేసులు - CORONA IN KERALA
దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఇవాళ మరో 5వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో మరో 3వేల మందికిపైగా వైరస్ బారిన పడ్డారు. కేరళలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ఆ రాష్ట్రంలో కొత్తగా 270కిపైగా కేసులు నమోదయ్యాయి.
మహాలో జోరు తగ్గని కరోనా.. మరో 5వేల కేసులు
By
Published : Jul 7, 2020, 8:50 PM IST
|
Updated : Jul 7, 2020, 9:28 PM IST
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో ఇవాళ 5,134 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 224 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,296 మంది కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2,17,121కి, మరణాలు 9,250కి చేరాయి. ఇప్పటి వరకు మొత్తం 1,18,558 మంది కోలుకున్నారు. 89,294 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తమిళనాడులో..
తమిళనాడులో కరోనా పంజా విసురుతోంది. నేడు 3,616 కొత్త కేసులు నిర్ధరణయ్యాయి. 65 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,18,594కు చేరగా.. మరణాలు 1,636కు పెరిగాయి. 45,839 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దిల్లీలో..
దిల్లీలో ఇవాళ 2,008 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,02,831కి, మరణాల సంఖ్య 3,165కి చేరింది.
కేరళలో మళ్లీ విజృంభణ
కేరళలో కొద్ది రోజులుగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇవాళ 272 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5,894కు చేరింది.