తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చైనా వ్యూహమేంటి? గల్వాన్​ ఘటనతో లక్ష్యం నెరవేరిందా?

20 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న చైనాపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గల్వాన్​ లోయను చేజిక్కించుకోవడానికి చైనాకు ఇదే సరైన సమయమా? పక్కా ప్రణాళికతోనే లోయలో చైనా హింసకు పాల్పడిందా? భారత్​ను ఏకాకి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న చైనాకు గల్వాన్ లోయ ఎందుకంత ముఖ్యం?

India China face-off timing in context of other border disputes
గాల్వన్​ లోయ ఘటనతో చైనా లక్ష్యం నెరవేరిందా?

By

Published : Jun 18, 2020, 6:42 PM IST

Updated : Jun 18, 2020, 7:02 PM IST

గల్వాన్​ లోయ ఉదంతంతో దేశం ఉలిక్కిపడింది. ఒక్క తూటాను కూడా ఉపయోగించకుండానే.. భారత్​-చైనా సైనికులు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం.. లోయలో ఆ రోజు జరిగిన హింసాత్మక ఘటన తీవ్రతను కళ్లకు కడుతోంది. రాడ్లు, రాళ్లతో చైనీయులు.. భారత సైనికులపై విరుచుకుపడ్డారన్న వార్త.. దేశ ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. అసలు చైనా ఇంతటి ఘాతుకానికి పాల్పడటానికి కారణమేంటి? ఇంత ఉద్రిక్తతను సృష్టించాల్సిన అవసరమేంటి?

వాస్తవాధీన రేఖ వెంబడి...

ఎన్నో దశాబ్దాల భారత్​- చైనా సరిహద్దు వివాదానికి.. వాస్తవాధీన రేఖ (ఎల్​ఏసీ) సాక్ష్యంగా నిలిచింది. అలాంటి ఎల్​ఏసీలో ఉండే పరిస్థితులను తెలుసుకోవడం ఎంతో అవసరం.

ఎల్​ఏసీ వెంబడి సరిహద్దును గుర్తించేందుకు సరైన వెసులుబాట్లు లేవు. ముఖ్యంగా లద్దాఖ్​లోని పలు ప్రదేశాల్లో కేవలం బండరాళ్లనే సరిహద్దుగా భావిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్​-చైనా దళాలు నిత్యం గస్తీ కాస్తూ ఉంటాయి. ఇరు దేశాలు చేసుకున్న పరస్పర అంగీకారం మేరకు.. ఎక్కడివరకు పెట్రోలింగ్​ నిర్వహించాలో క్షేత్రస్థాయిలోని సైన్యాధికారులు నిర్ణయిస్తారు.

ఎత్తైన ప్రాంతాల్లో ఉండే ఎల్​ఏసీని చాలా వరకు సైన్యమే గస్తీ కాస్తుంది. కొన్ని చోట్ల ఐటీబీపీ ఆ బాధ్యతలను చేపడుతుంది. అయితే ఈ ఎల్​ఏసీలో అత్యంత ముఖ్యమైనవి తూర్పు లద్దాఖ్​లోని పాంగోంగ్ సరస్సు, గల్వాన్ లోయ. ఈ​ సరస్సు మూడింట ఒక వంతు చైనాలో ఉండగా.. మిగిలినది భారత భూభాగంలో ఉంది.

భౌగోళికంగా ఇక్కడ ఎంతో ముఖ్యమైనవి ఫింగర్​-4, ఫింగర్​-8. చైనీయులు ఫింగర్​-4ను వాస్తవాధీన రేఖ కింద భావిస్తుంటే.. భారత్​ మాత్రం ఫింగర్​-8నే ఎల్​ఏసీ అని విశ్వసిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో విధులు నిర్వహించడం ఇరు దేశాల సైనికులకు పెద్ద చిక్కు.

ఆ రోడ్డు కోసమే పోరు?

సోమవారం భారత్​-చైనా జవాన్ల మధ్య జరిగిన భీకర పోరుకు గల్వాన్ లోయ సాక్ష్యంగా నిలిచింది. అయితే దీనికి సమీపంలోనే డీబీఓ రోడ్డు ఉంది. తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి విధులు నిర్వహిస్తోన్న జవాన్లకు ఈ రోడ్డు ఒక్కటే జీవనాధారం. పైగా ఉత్తర లద్దాఖ్​కు ఈ రోడ్డు ఎంతో అవసరం. అందుకే దీనిని రక్షిస్తున్న గల్వాన్ లోయ భారత్​కు అత్యంత ప్రాధాన్యం.

ఒక రకంగా చూస్తే... గల్వాన్ లోయ భారత్​కు ఎంత ముఖ్యమో.. చైనాకు కూడా అంతే అవసరం. అక్సాయిచ్​కు సమీపంలో గల్వాన్​ లోయ ఉండటమే ఇందుకు కారణం.

ఇంత ముఖ్యమైన ప్రదేశం కాబట్టే చైనా దీనిని ఘర్షణకు ఎంచుకుంది. ఫింగర్​-4కు చేరుకున్న చైనీయులు.. పరిస్థితులను మార్చడానికే హింసకు పాల్పడ్డారు.

కానీ భారత్​ బృందం మాత్రం... ఈ నెల 6న కమాండర్​ స్థాయిలో జరిగిన చర్చల ఫలితాలను అనుసరిస్తూనే విధులు నిర్వహించింది. ప్రొటోకాల్​ను అనుసరిస్తూనే ఎల్​ఏసీ వెంబడి సైనికులు వెనుదిరుగుతున్న సమయంలో కర్నల్ సంతోష్​ బాబు నేతృత్వంలోని బృందం.. కొన్ని శిబిరాలను గుర్తిచింది. వాటిని వెంటనే ధ్వంసం చేసింది. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న చైనీయులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. హింసను సృష్టించాలని అందిన ఆదేశాలను పాటించి.. భారత సైనికులపై విరుచుకుపడ్డారు. కానీ భారతీయులు మాత్రం శాంతియుతంగానే సమస్యను పరిష్కరించుకుందామని చూశారు.

'కశ్మీర్​' అభివృద్ధి ఓర్చుకోలేక?

జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడం కూడా చైనా ఆగ్రహానికి ఓ కారణంగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మారుమూల గ్రామాలను అనుసంధానించేలా రోడ్లు, వంతెన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంత అభివృద్ధిని చూసి చైనా ఓర్వలేకపోతోంది.

టార్గెట్​ భారత్​?

పాకిస్థాన్​తో చైనాకు ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే.. నేపాల్​, శ్రీలంక కూడా చైనాకు మిత్రదేశాలుగా మారాయి. ముఖ్యంగా చైనా అండ చూసుకునే భారత్​పై నేపాల్​ కయ్యానికి కాలుదువ్వుతోంది. ఇవన్నీ చూస్తుంటే.. భారత్​ను ఏకాకి చేయడమే చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనపడుతోంది.

సరిహద్దులో సీపెక్​ (చైనా పాకిస్థాన్​ ఎకనామిక్​ కారిడర్​)ను ఓ గేమ్​ ఛేంజర్​గా భావిస్తున్నాయి ఆయా దేశాలు. పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని గిల్గిట్​-బాల్టిస్థాన్​ మీదుగా కస్గర్​ నుంచి అరేబియా సముద్రం వరకు ఉండే ఈ నడవా​.. చైనాను ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తుంది. ఈ ప్రాజెక్టుకు అండగా నిలిచింది పాక్​.

పాక్​ ఆక్రమిత కశ్మీర్​.. మిలిటెంట్ల అడ్డాగా మారింది. ఈ ప్రాంతం నుంచి సీపెక్​ను నిర్మించడం పెద్ద సమస్యగా ఉండేది. అయితే.. జైషే మహ్మద్​ అధినేత మౌలానా మసూద్​ అజార్​ను భారత్​ నుంచి పాక్​ ఆధారిత ఉగ్రవాదులు విడిపించుకోవడానికి చైనా సహాయం చేసిందన్న వాదనలు ఎంతో కాలంగా వినిపిస్తున్నాయి. అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించి.. బ్లాక్​ లిస్ట్​లో చేర్చాలన్న భారత్​ డిమాండ్​కు కూడా అడ్డుపడుతోంది చైనానే. గిల్గిట్​-బాల్టిస్థాన్​ కేంద్రంగా ఇప్పుడు అజార్​ తన ఉగ్ర కార్యకలాపాలను సాగిస్తున్నాడు. అజార్​కు సహాయం చేసి ఉండకపోతే.. సీపెక్​ ప్రాజెక్ట్​లో రోడ్డు నిర్మాణంలో చైనా ఎన్నో కష్టాలను ఎదుర్కొనేదే.

ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్​ఓసీ)... వాస్తవాధీన రేఖ (ఎల్​ఏసీ) ఒకలాగే కనిపిస్తున్నాయి. రెండింటి నుంచి భారత్​కు తీవ్ర సమస్యలు వచ్చిపడుతున్నాయి. పాకిస్థాన్-చైనా మధ్య బలంగా పాతుకుపోయిన స్నేహమే ఇందుకు కారణం.

అన్ని వైపుల నుంచి చైనా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న తురణంలో.. వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలనేదే భారత్​ ముందు ఉన్న అతిపెద్ద సవాలు. దౌత్య, రాజకీయ మార్గాల్లో సమస్యను పరిష్కరించుకోవడానికి భారత్​ ప్రయత్నించాలి. అన్ని దారులూ మూసుకుపోయేంత వరకూ సైనిక చర్యను ఓ ఆప్షన్​గా పరిగణించకూడదు.

--- బిలాల్​ భట్​, ఈటీవీ భారత్​ ఎడిటర్​

Last Updated : Jun 18, 2020, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details