భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. 17 వేల అడుగుల ఎత్తులో ఉన్న గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికులు బాహాబాహీకి దిగటం వల్ల కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. మరో పది మంది గల్లంతైనట్లు సమాచారం.
"వాస్తవాధీన రేఖ దాటి భారత భూభాగంలో చైనా కొన్ని తాత్కాలిక నిర్మాణాలు చేపట్టింది. కమాండింగ్ అధికారి నేతృత్వంలోని భారత సైన్యం వాటిని ధ్వంసం చేసింది. మొదట పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సైనికులు వెనుదిరిగారు. కానీ హఠాత్తుగా 1000మంది చైనా సైనికులు ముందుకు వచ్చారు. భారత్‌వైపు కూడా 1000మంది జవాన్లు ఉన్నారు. నదీ ప్రాంతంలో ఈ ఘర్షణ తలెత్తడం వల్ల చాలా మంది సైనికులు నదిలో పడిపోయారు."
- సైనికాధికారి
అయితే ఘర్షణ సమయంలో రెండు దేశాల సైనికులు ఒక్క తుపాకీ పేలలేదని.. ముఖాముఖి యుద్ధానికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాళ్లు విసురుకోవటం, ఇనుప రాడ్లు, పదునైన ఆయుధాలతో దాడి చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కొందరికి బుల్లెట్ గాయాలు ఉన్నాయని చెబుతున్నా దీనిపై ఎలాంటి ధ్రువీకరణ లేదు.
ఆర్మీ వర్గాల సమాచారం ప్రకారం, భారత సైనికులు తీవ్రంగా గాయపడ్డారని.. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు తగ్గించేందుకు చైనాతో చర్చిస్తున్న బృందంలో కల్నల్ సంతోష్ బాబు కూడా ఉన్నారు.
చైనా సైనికులూ..
చైనా వైపున కూడా భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. మరణించినవారు, గాయపడ్డవారు దాదాపు 43 మంది ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ సైనికుల మరణానికి సంబంధించి చైనా అధికారిక ప్రకటనేదీ చేయలేదు. 1975 తర్వాత భారత్- చైనా సరిహద్దుల్లో ప్రాణనష్టం సంభవించటం ఇదే తొలిసారి.
ప్రాథమిక సమాచారం మేరకు గాల్వన్ లోయలోని గస్తీ పాయింట్- 14 వద్ద సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదే ప్రాంతంలో ఇరు దేశాల ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల సమావేశంలో అంగీకరించిన నిర్ణయాలను అమలుపై చర్చించారు.