ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈశాన్య రాష్ట్రాలు దేశానికి అభివృద్ధి ఇంజిన్లుగా మారాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. జాతి అభివృద్ధికి ఈశాన్య రాష్ట్రాలే కేంద్ర బిందువు అని మోదీ భావిస్తున్నారని తెలిపారు. గత ఆరేళ్లలో 30 సార్లు మోదీ ఈ ప్రాంతాలను సందర్శించారని గుర్తు చేశారు. వచ్చిన ప్రతిసారి.. ఇక్కడి రాష్ట్రాలకు కానుకలు తీసుకొచ్చారని చెప్పారు.
అసోంలోని కామరూప్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సీఎం శర్వానంద సోనోవాల్, ఆర్థిక మంత్రి హిమాంత బిశ్వ శర్మ నేతృత్వంలో అసోం శాంతియుత, అభివృద్ధి బాటలో పయనిస్తోందని పేర్కొన్నారు.
"అసోంను ఇదివరకు.. ఆందోళనలు, హింసకు గుర్తుగా చూసేవారు. కానీ, సోనోవాల్, శర్మ.. రాష్ట్ర ప్రజలను ఐక్యం చేశారు. సంప్రదాయాలు, వారసత్వ సంపదను ప్రోత్సహిస్తూ ఈ ప్రాంతాన్ని దేశంతో అనుసంధానించారు. రాష్ట్రంలోని వేర్పాటువాద సంస్థలు లొంగిపోయాయి. జనజీవన స్రవంతిలో కలిసిపోయారు."
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
రాష్ట్రాల సంస్కృతి బలోపేతమయ్యేంత వరకు దేశం సమున్నతంగా మారదని అన్నారు షా. ఇదే విషయాన్ని భారతీయ జనతా పార్టీ విశ్వసిస్తుందని పేర్కొన్నారు. అసోం సంస్కృతి, కళలు లేని భారతీయ సంస్కృతి అసంపూర్ణమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు.