బిహార్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భవనాలు, భారీ వృక్షాలు నెలకొరిగాయి. రవణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. తూర్పు మధ్య రైల్వే 30 రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది.
భారీ వర్షాల కారణంగా పట్నా, భగల్పుర్, కైముర్ జిల్లాల్లో 13 మంది మృతి చెందారు. వందల మంది నిరాశ్రయులయ్యారు. భగల్పుర్లో బరారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఆలయం ప్రహరీ గోడ కూలి ముగ్గురు మృతి చెందారు. పట్నా దనపుర్ ప్రాంతంలో రోడ్డుపై వెళుతున్న ఆటోపై భారీ వృక్షం పడి ఏడాది పాపతో పాటు ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. కైముర్లోని భభువాలో రెండు ఇళ్లు కూలిపోయి ముగ్గురు మృతి చెందారు.
రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.