మొదట కరోనా అనగానే భయపడిపోవడం మానేయాలి. వ్యాధి లక్షణాలైన దగ్గు, జ్వరం, శ్వాస సమస్యలతో బాధపడుతున్న వారికి పిల్లలు దగ్గరగా వెళ్లినపుడు మాత్రమే వైరస్ సోకుతుంది. అది కూడా రెండు మీటర్ల దగ్గరగా వెళ్లి, 15 అంతకంటే ఎక్కువ నిమిషాలు ఉంటేనే ప్రమాదం. అలాంటి వారు ఇష్టమైన వ్యక్తులైనా సరే పిల్లల్ని వారి దగ్గరకు పోనీయొద్దు. ఒకవేళ పిల్లలకు కరోనా సోకినా స్వల్ప అనారోగ్యమే కనిపిస్తుంది. చైనాలో ప్రతి 100 కరోనా కేసుల్లో పిల్లల్లో నమోదవుతున్నవి రెండు కంటే తక్కువే.
ఇన్‌ఫెక్షన్ నుంచి కాపాడుకోవాలి
ఇళ్ల తలుపులు, వాటి గొళ్లాలు, ఇతర ఉపరితలాలపై కొన్ని గంటల వరకు వైరస్ బతికుంటుంది. పిల్లలు వీటిని ముట్టుకున్నా, అవే చేతులతో ముఖాన్ని తాకినా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందుకే చేతులను సబ్బుతో కనీసం 20 సెకన్లపాటు శుభ్రంగా కడుక్కునేలా పిల్లలకు అలవాటు చేయాలి. ముఖాన్ని తాకడం మాన్పించాలి.
ఇన్‌ఫెక్షన్ నుంచి కాపాడుకోవాలి ఆ 14 రోజులు కీలకం..
ఈ వైరస్ ఇంక్యుబేషన్ సమయం 14 రోజులు. బాధితులతో కలిసిన నాటి నుంచి ఆ సమయం తర్వాత కూడా పిల్లలు ఆరోగ్యంగా ఉంటే... వ్యాధి సోకనట్లే లెక్క. ఒకవేళ పిల్లలకు దగ్గు, జ్వరం, శ్వాస సమస్యలు ఉంటే మాత్రం ఎవ్వరితోనూ కలవనీయొద్దు. వైద్యులను సంప్రదించాలి.
ఆ ప్రాంతం నుంచి తిరిగొస్తే...
కరోనా పీడిత దేశాల నుంచి ఈ నెలలో తిరిగొచ్చిన వారిని కలిసినా.. వ్యాధి బాధితులు ఉంటున్న ప్రదేశాల్లో ఆడుకుని పిల్లలు ఇంటికి వచ్చినా వెంటనే వారిని 14 రోజులపాటు ఏకాంతంగా ఉంచాలి. వారిలో వ్యాధి లక్షణాలు అస్సలు కనిపించకున్నా ఈ జాగ్రత్త తీసుకోవాల్సిందే.
వైద్య పరీక్షలకు సహకరించేలా..
వైద్య పరీక్షలకు సహకరించేలా.. పిల్లల ఆరోగ్య లక్షణాలను పరిశీలించిన తర్వాతే వైద్యులు నమూనాలు సేకరిస్తారు. ముక్కు, గొంతులో దూదితో తుడిచి నమూనాలు తీసుకుంటారు. దగ్గినప్పుడు వచ్చే తెమడను సేకరిస్తారు. ఇది కొంత అసౌకర్యంగా అనిపించినా.. భయపడాల్సిన పనిలేదంటూ పిల్లలను తల్లిదండ్రులు సిద్ధంచేయాలి.
కరోనా పరీక్ష చేస్తే....!
పిల్లల నుంచి సేకరించిన నమూనాల పరీక్షల నివేదిక రావడానికి ఒకట్రెండు రోజుల సమయం పడుతుంది. అప్పటివరకు ఇంట్లోని ఇతర సభ్యులతోపాటు పిల్లలు సైతం నోటికి, ముక్కుకు మాస్కులు కట్టుకోవాలి. చేతులకు తొడుగులు వేసుకోవాలి. దగ్గినా, తుమ్మినా శుభ్రమైన గుడ్డ, టిష్యూపేపర్లు అడ్డంగా పెట్టుకోవాలి. వాటిని మూసి ఉన్న చెత్తడబ్బలోనే వేయాలి. ఇల్లు, ఆవరణను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. పరీక్షల నివేదిక రాకముందే పిల్లాడు అనారోగ్యానికి గురైతే తక్షణం సంబంధిత వైద్యులను సంప్రదించాలి.
తాజా వివరాలు తెలుసుకోవాలి
వైరస్ వ్యాప్తి, తదనంతర పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వాటికనుగుణంగా అప్రమత్తం కావడానికి తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలి. దీనికి ప్రభుత్వ అధికారులు విడుదలచేసే సమాచారంపై మాత్రమే ఆధారపడాలి.