కర్ణాటక చిక్క మంగళూరులో కరోనా చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రి రూ.9,25,601 వసూలు చేసింది. దీనికి రూపాయి డిస్కౌంట్ కూడా ఇచ్చింది. అయితే బాధితుడి ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయింది.
కాడూర్ తాలుకాలోని పిల్లెనహళ్లికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు కరోనా చికిత్స కోసం ఈ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించి చివరకు ప్రాణాలు కోల్పోయారు.
చిక్కమంగళూరు జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడికి చెందిన ఆస్పత్రిలో ఈ నిర్వాకం జరిగింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుడు మరణించినప్పటికీ అంత డబ్బులు వసూలు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు.
ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.