హిమాచల్ ప్రదేశ్‌లో వరదల బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలకు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వానల ధాటికి చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగి రహదారులపై పడుతున్నాయి. ఫలితంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
జాతీయ రహదారి మూసివేత
కుల్లులోని అఖారా బజార్ సమీపంలో బియాస్‌నదిపైనున్న వంతెన కూలింది. కొండచరియలు విరిగిపడి కుల్లు-మనాలీ 3వ నంబరు జాతీయ రహదారి ధ్వంసమైంది. ఈ దారిలో రాకపోకలు నిలిచిపోయి భారీ స్థాయిలో వాహనాలు బారులు తీరాయి. విరిగిపడిన కొండచరియలను తొలగిస్తున్నా మరిన్ని చోట్ల పడుతూనే ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా వర్షాల కారణంగా సంభవించిన వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది మృతి చెందారు.
నదీ తీరాల్లో హెచ్చరిక
చంపా జిల్లాలో వరద ఉద్ధృతికి రహదారి తెగిపోయింది. రాకపోకల కోసం తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. అనేక నదులు, ముఖ్యంగా రావి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. నదీ తీరాలకు వెళ్లొద్దని హెచ్చరించింది.
విద్యుత్ సేవలకు అంతరాయం
రావి నది మీద జీఎంఆర్ సంస్థ నిర్మిస్తున్న 180 మెగావాట్ విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన పలు కంటెయినర్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షాలతో రాష్ట్రంలో చాలా చోట్ల విద్యుత్ సేవలకు అంతరాయం కలుగుతోంది.
సిమ్లాలో భారీ వర్షాలకు ఓ గోడ కూలిపోయిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. రాష్ట్ర వ్యాప్తంగా సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఇదీ చూడండి: ఉత్తరాదిపై వరుణుడి ప్రతాపం- జనం విలవిల