తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్ర: భారీ వర్షాలకు 30 మంది మృతి - రైళ్లు

కుండపోత వర్షాల కారణంగా మహారాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ ప్రాంతాల్లో గోడలు, ఇతర నిర్మాణాలు కూలి ఇప్పటికే 30 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

మహారాష్ట్ర: భారీ వర్షాలకు 30 మంది మృతి

By

Published : Jul 2, 2019, 1:00 PM IST

జలమయమైన రోడ్లు- ప్రజలకు తప్పని ఇక్కట్లు

భారీ వర్షాలు.. నదులను తలపిస్తున్న రోడ్లు.. నిలిచిపోయిన విద్యుత్​ సరఫరా.. కూలుతున్న గోడలు.. సముద్ర తీరంలో భయంకరంగా ఎగిసి పడుతున్న అలలు... ఇదీ మహారాష్ట్రలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి.

నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 48 గంటలు అతిభారీ వర్షాలు కురుస్తాయన్న వార్తలతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు.

కుండపోత వర్షాల కారణంగా మంగళవారం మహారాష్ట్ర పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వరుణుడి ప్రతాపం వల్ల ఇప్పటివరకు 30 మంది మరణించారు.

పెరుగుతున్న మృతుల సంఖ్య...

రాష్ట్రంలో ఇప్పటివరకు నాలుగు చోట్ల గోడలు కూలాయి. ఈ విషాదంలో ఇప్పటికే 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 80 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ముంబయి తూర్పు మలాడ్​​ ప్రాంతంలో అర్ధరాత్రి గోడ కూలి అత్యధికంగా 18 మంది మృతిచెందారు. పుణెలో ఆరుగురు, ఠానే జిల్లాలోని కల్యాణ్​లో ముగ్గురు, పాల్​గర్​లో ఇద్దరు గోడలు కూలి ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు సహాయకచర్యలు చేపట్టాయి.

క్షతగాత్రులను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.

అధికారులు అప్రమత్తం...

రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వాలని సూచించింది. అనేక ప్రాంతాల్లో విద్యాసంస్థలు మూతపడ్డాయి. పలు రైళ్లు రద్దవగా... మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. విమాన సేవలకూ ఆటకం కలిగింది. ముంబయి విమానాశ్రయంలో 54 విమానాలను దారి మళ్లించారు. 52 విమానాలు నిలిచిపోయాయి. సోమవారం అర్ధరాత్రి జయపుర​- ముంబయి విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ముంబయి విమానాశ్రయంలో ల్యాండ్​ అవుతుండగా విమానం అదుపుతప్పింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు అందులోని 167 మంది ప్రయాణికులను రక్షించారు.

ఇదీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details