మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారంపై స్టే విధించాలని దాఖలైన పిటిషన్పై అత్యవసర విచారణకు బొంబాయి హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల ముందు ఏర్పడిన కూటమి నియమాలకు లోబడి భాజపా-శివసేన ఉండాలని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యంపై అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు పిటిషనర్లు.
ఈ వ్యాజ్యాన్ని విచారించేందుకు హైకోర్టుకు చెందిన రెండు వేరువేరు ధర్మాసనాలు నిరాకరించాయి. అయితే.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రదీప్ నంద్రజోగ్, జస్టిస్ భారతి దంగ్రే నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్ల వాదనలు ఆలకించింది. ఠాక్రే ప్రమాణ స్వీకారంలో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా లేనిది ఏముందో చెప్పాలని పిటిషనర్లను ప్రశ్నించింది ధర్మాసనం.