తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉల్లి సాయంతో లాక్​డౌన్​లో 1200 కి.మీ జర్నీ! - Mumbai to Allahabad travel with use of Onions

లాక్​డౌన్​ కారణంగా దేశవ్యాప్తంగా చాలామంది ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయారు. ఎలాంటి కరోనా కేసుల్లోని గ్రీన్​జోన్లలో ఉంటే ఫర్వాలేదు. మరి రెడ్​జోన్లలో ఇరుక్కుపోతే పరిస్థితి ఏంటి? అక్కడి విషమ వాతావరణం నుంచి బయటపడేదెలా? ఈ సమస్యను సరికొత్తగా అధిగమించాడు ఉత్తర్​ప్రదేశ్ అలహాబాద్​కు చెందిన ఓ వ్యక్తి.

Have onions, will travel: Mumbai man turns to vegetable trade to beat lockdown
ముంబయిలో ఇరుక్కుపోయి 'ఉల్లి' సాయంతో అలహాబాద్​ చేరాడు

By

Published : Apr 26, 2020, 1:05 PM IST

లాక్​డౌన్​లో ఇంటికి ఎలా వెళ్లాలి? గత కొన్ని రోజులుగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారి మనసును తొలుస్తున్న ప్రశ్న ఇది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌తో గడప దాటి బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఎప్పుడు ఆంక్షలు ఎత్తివేస్తారా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ముంబయిలో ఉంటున్న ఓ వ్యక్తికి సరికొత్త ఆలోచన వచ్చింది. ప్రభుత్వ సడలింపుల్లోని ఓ అవకాశాన్ని ఉపయోగించుకొని 1200 కి.మీ ప్రయాణించి ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇంటికి చేరుకున్నాడు.

ఇదీ జరిగింది

ఉత్తర్​ప్రదేశ్​ అలహాబాద్‌కు చెందిన ప్రేమ్‌ మూర్తి పాండే ముంబయి విమానాశ్రయంలో పనిచేస్తున్నాడు. అంధేరీలో నివాసం ఉంటున్నాడు. తొలిదశ లాక్​డౌన్​లో అతను ఇంట్లోనే గడిపాడు. కానీ, ఆ తర్వాత ప్రభుత్వం లాక్​డౌన్​ పొడిగించడమూ.., ముంబయిలో వైరస్‌ వ్యాప్తి క్రమంగా పెరుగుతుండడం అతణ్ని ఆందోళనకు గురిచేసింది. ఇరుకుగా, జనసంచారం ఎక్కువగా ఉండే అంధేరీకి వైరస్​ వ్యాపిస్తే పెద్ద ప్రమాదం తప్పదని అంచనా వేశాడు. ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలని ఆలోచించాడు. దాని కోసం ఉపాయం ఆలోచిస్తూ ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపుల్ని క్షుణ్నంగా పరిశీలించాడు. వాటిలో నిత్యావసర వస్తువుల రవాణాకు కేంద్రం అనుమతించిన విషయాన్ని గ్రహించాడు. దీన్ని ఆసరాగా చేసుకొని ఎలాగైనా ఇంటికి చేరాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు.

ముంబయి టు అలహాబాద్​ వయా నాసిక్​

ముంబయిలోని ఓ పుచ్చకాయల వ్యాపారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు ప్రేమ్. నాసిక్‌లోని మార్కెట్‌కు వెళ్లి 1300 కిలోల పండ్లు తెస్తానని హామీ ఇచ్చాడు. దీని కోసం డ్రైవర్‌తో కూడిన ఓ మినీ ట్రక్కును అద్దెకు తీసుకున్నాడు. నాసిక్‌ సమీపంలో ఉన్న పింపల్‌గావ్‌కు వెళ్లి లోడ్‌ను ట్రక్కులోకి ఎక్కించి ముంబయికి పంపాడు. తాను మాత్రం అక్కడే ఉండిపోయాడు. అక్కడి నుంచి మళ్లీ అలహాబాద్‌కు ఎలా వెళ్లాలో ఆలోచించాడు. మార్కెట్‌ను క్షుణ్నంగా పరిశీలించాడు. ఉల్లికి బాగా గిరాకీ ఉండడం గమనించి దాన్ని కొనుగోలు చేసి అలహాబాద్‌ మార్కెట్‌కు తరలించాలని నిర్ణయించుకున్నాడు. కిలో రూ.9.10ల చొప్పున 25,520 కిలోల ఉల్లిని కొనుగోలు చేశాడు. రూ.77,500కు ఓ లారీని మాట్లాడుకున్నాడు. ఏప్రిల్​ 20న లోడ్‌ ఎక్కించి ఎక్కడా ఎలాంటి అవాంతరం లేకుండా మూడు రోజుల్లో (ఏప్రిల్​ 23న) అలహాబాద్‌ చేరుకున్నాడు. తన ఉల్లిని అమ్మేందుకు నగర శివార్లలోని ముందేరా హోల్​సేల్​ మార్కెట్​కు చేరుకున్నాడు. అయితే అక్కడ ఉల్లిని కొనేందుకు ఎవరూ సిద్ధంగా లేనందున... ట్రక్కును తన స్వగ్రామమైన కొత్వా ముబార్క్​పుర్​కు తీసుకెళ్లాడు. అలా మొత్తానికి ఉల్లి సాయంతో ఇంటికి చేరాడు.

స్వీయ నిర్బంధం

అయితే, ఇన్ని కిలోమీటర్లు ప్రయాణించిన తనకు ఎక్కడైనా వైరస్‌ సోకే ప్రమాదం ఉందని అనుకున్నాడు ప్రేమ్. తన వల్ల ఎవరూ ఇబ్బంది పడొద్దని భావించి అన్​లోడ్‌ చేయగానే తానే స్వయంగా స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. విషయం చెప్పాడు. పరీక్షలు చేయించుకున్నాడు. ఎలాంటి కరోనా లక్షణాలు లేనందున పోలీసులు, వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటున్నాడు.

ఇదీ చూడండి : 'కరోనాపై పోరులో ప్రతి పౌరుడు సైనికుడే'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details