హాథ్రస్ కేసులో వివాదాస్పద రీతిలో వ్యవహరించిన పోలీసులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది అలహాబాద్ హైకోర్టు. అత్యాచారానికి గురైన బాధితురాలికి ఆచారాలకు విరుద్ధంగా హడావుడిగా అర్ధరాత్రి దహన సంస్కారాలు చేయడాన్ని తప్పుబట్టింది. ఇలా చేయడాన్ని మానవహక్కుల ఉల్లంఘనగా పేర్కొంది. ఆమె కుటుంబ సభ్యుల హక్కులను కూడా ఉల్లంఘించినట్లేనని తెలిపింది.
ఘటనకు సంబంధించిన వివరాలను రహస్యంగా ఉంచి.. రాజకీయ పార్టీలు, మీడియాను అనుమతించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు లఖ్‌నవూ బెంచ్. నవంబరు 2న జరగనున్న విచారణకు సస్పెండ్ అయిన హాథ్రస్ ఎస్పీ విక్రాంత్ వీర్‌ను హాజరవ్వాలని ఆదేశించింది.