దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రస్ హత్యాచారం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ.. కోర్టులో అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. సందీప్, లవ్‌కుశ్, రవి, రాముపై సామూహిక అత్యాచారం, హత్య నేరాలకు సంబంధించిన సెక్షన్ల కింద అభియోగాలు మోపింది.
సెప్టెంబర్ 14న హథ్రస్‌లో ఓ ఎస్సీ యువతిపై నిందితులుగా పేర్కొన్న నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సీబీఐ తేల్చింది. ఆమె దిల్లీలోని సప్ధర్‌గంజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 19న ప్రాణాలు విడిచింది. సెప్టెంబర్ 30న ఆమె ఇంటికి సమీపంలోనే పోలీసులు కర్మకాండలు నిర్వహించారు. పోలీసులు బలవంతం పెట్టి అంత్యక్రియలు నిర్వహించినట్లు ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు.
ఈ విషయంలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌కు వ్యతిరేకంగా విపక్షాలు పెద్దఎత్తున ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన సీబీఐ ఈ హత్యాచారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితుల పాత్రపై ఫోరెన్సిక్ నివేదికలతో పాటు అనేక ఆధారాలు సేకరించింది. యువతికి చికిత్స అందించిన వైద్యుల నుంచి కూడా సమాచారం సేకరించి అభియోగపత్రాన్ని దాఖలు చేసింది.