తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'హరియాణా' కోటలో భాజపా జెండా? - జేజేపీ కీలక ప్రకటన

హరియాణా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు దిశగా భాజపా అడుగులు వేస్తోంది. ఇప్పటికే నలుగురు స్వతంత్ర అభ్యర్థులు భాజపా తలుపుతట్టారు. దీనితో ప్రభుత్వ ఏర్పాటుకు రెండు సీట్ల దూరంలో ఉంది కాషాయ దళం. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కింగ్​మేకర్​, జేజేపీ నేత దుష్యంత్​ చౌతాలా.. హరియాణా రాజకీయాలపై కీలక ప్రకటన చేయనున్నారని సమాచారం.

'హరియాణా' కోటలో భాజపా జెండా?

By

Published : Oct 25, 2019, 1:37 PM IST

Updated : Oct 25, 2019, 4:50 PM IST

'హరియాణా' కోటలో భాజపా జెండా?

హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా భాజపా అడుగులు వేస్తోంది. మ్యాజిక్ ఫిగర్​కు కేవలం 6 సీట్ల దూరంలో నిలిచిన కాషాయ దళానికి ఇప్పటికే ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతు ప్రకటించారు. మిగిలిన మగ్గురిలో మరొకరు కమలం పార్టీ తలుపు తడితే భాజపాకు ప్రభుత్వ ఏర్పాటు సులభమవుతుంది.

గురువారం విడుదల చేసిన ఎన్నికల ఫలితాల్లో భాజపా 40, కాంగ్రెస్​ 31, జేజేపీ 10 సీట్లు దక్కించుకున్నాయి. 8 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ప్రభుత్వ స్థాపనకు కావాల్సిన మెజారిటీ 46.

నడ్డాతో ఖట్టర్​...

రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి మనోహర్​లాల్​ ఖట్టర్​. హంగ్​ ఏర్పడిన నేపథ్యంలో భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు ఖట్టర్​. తదుపరి కార్యాచరణపై ఇరు నేతలు చర్చించారు.

జేజేపీ ఎటువైపు...?

అనూహ్య పరిణామాల్లో కింగ్​మేకర్​గా ఆవిర్భవించిన జన నాయక్​ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందనే విషయమై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 10మంది ఎమ్మెల్యేలున్న జేజేపీ ఎవరికి మద్దతిస్తుందా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్ర 4గంటలకు జేజేపీ నేత దుష్యంత్​ చౌతాలా విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కన్పిస్తోంది. సమావేశానికి ముందు తిహార్​ జైలులో ఉన్న తన తండ్రి అజయ్​ చౌతాలాను కలవనున్నారు జేజేపీ నేత.
భాజపాకు జేజేపి మద్దతు ప్రకటిస్తే.. కమలం పార్టీ బలం మరింత పెరుగుతుంది. అలా కాని సందర్భంలో స్వతంత్రులతోనే భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముంది.

కాంగ్రెస్​ పరిస్థితి ఏంటీ?

దుష్యంత్​ చౌతాలా కాంగ్రెస్​కు మద్దతు ప్రకటించినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జేజేపీతో పొత్తు వల్ల కాంగ్రెస్​ కూటమి బలం 41కి పెరుగుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 5 సీట్లు కావాల్సి వస్తుంది.

ఈ నేపథ్యంలో తదుపరి వ్యూహరచనపై కాంగ్రెస్‌ దృష్టి సారించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌, అగ్రనేత రాహుల్ గాంధీ సహా 17 మందితో సమావేశం ఏర్పాటు చేసిన కమిటీ.. అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో భేటీ అయ్యింది. ఎన్నికల ఫలితాలు, హంగ్‌ అసెంబ్లీ ఏర్పడిన హరియాణాలో అనుసరించాల్సిన వ్యూహం సహా కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటం గురించి కూడా భేటీ చర్చించింది.

ఇదీ చూడండి:- 'భాజపాతో కలిస్తే.. స్వతంత్రులపై పాదరక్షల వర్షమే'

Last Updated : Oct 25, 2019, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details