మిషన్ 75 ప్లస్...! హరియాణాలో భాజపా ఎన్నికల నినాదం. అందుకు తగినట్లే పదునైన వ్యూహాలు అమలుచేసింది కమలదళం. సార్వత్రిక విజయం ఇచ్చిన ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ప్రచార క్షేత్రంలో దూసుకెళ్లింది. మరోమారు ఖట్టర్ సర్కార్ ఏర్పాటు ఖాయమని కమలనాథులు ధీమాగా చెప్పారు. ఎగ్జిట్ పోల్స్‌దీ అదే మాట.
ఎన్నికల ఫలితాల వేళ పరిస్థితి తారుమారైంది. భాజపా ముందంజలో ఉన్నా హరియాణాలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ఆధిక్యాన్ని సాధించలేకపోయింది. కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. అధికార భాజపాకు నువ్వా-నేనా అనే రీతిలో పోటీనిచ్చింది. ఇందుకు కారణమేంటి? భాజపా ఎంచుకొన్న '370', ఎన్ఆర్సీ ప్రచారాస్త్రాలు ఎందుకు పనిచేయలేదు? కాంగ్రెస్ ఎలా పుంజుకుంది?
సార్వత్రికంలో క్లీన్‌స్వీప్...
2019 సార్వత్రిక ఎన్నికల్లో హరియాణాలోని 10 లోక్‌సభ స్థానాలను క్లీన్‌స్వీప్ చేసింది భాజపా. రాష్ట్రంలో అంతటి ఆధిపత్యం ఉన్న కాషాయ పార్టీకి శాసనసభ ఎన్నికలు ఓ లెక్కా... అనుకున్నారు అంతా. అయితే అంతా తారుమారైంది. కాషాయ పార్టీకి ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు.
ఫలించని '370'...
రాష్ట్రాల ఎన్నికల్లోనూ జాతీయ సమస్యలను ప్రస్తావించి... ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేసింది భాజపా. ముఖ్యంగా జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు, దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటున్న జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ)ని ప్రచారాల్లో విరివిగా వాడింది. అయితే ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఇవి అధిగమించలేకపోయాయి. ముఖ్యంగా నిరుద్యోగిత రేటులో దేశంలోనే మూడో స్థానంలో ఉన్న హరియాణాలో ఈ '370' మంత్రం ఫలించలేదనే చెప్పాలి.
కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు...
లోక్‌సభ ఫలితాల నుంచి త్వరగా తేరుకొని... కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పకడ్బందీ వ్యూహాలు రచించి రాష్ట్రంలోని ఖట్టర్ ప్రభుత్వమే లక్ష్యంగా విమర్శల దాడి చేసింది. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యే ప్రధానాస్త్రంగా గురి చూసి సంధించింది.
పార్టీలో అంతర్గత వివాదాల్ని పరిష్కరించేందుకు చొరవ చూపింది కాంగ్రెస్ అధిష్ఠానం. పార్టీపై గతంలో భూపిందర్ సింగ్ హుడా అసమ్మతి వ్యక్తం చేయడాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించింది. హుడా డిమాండ్‌కు అనుగుణంగా కుమారి సెల్జాను పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించింది. మాజీ సీఎం బన్సీలాల్ కోడలు కిరణ్ చౌదరిని మేనిఫెస్టో కమిటీ అధ్యక్షురాలిగా నియమించింది. అలా కాంగ్రెస్ నేతలంతా ఐక్యంగా ఉన్నట్లు సంకేతం ఇచ్చింది అధిష్ఠానం.
ఎక్కడికక్కడ ముఖ్యనేతలకు బాధ్యతలు అప్పగించి... నిరాసలో ఉన్న కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. రాష్ట్ర సమస్యలనే తంత్రంగా మలచి... భాజపా '370' మంత్రాన్ని దీటుగా ఎదుర్కొంది.