తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రపంచ ఆరోగ్య సంస్థలో భారత్‌కు కీలక పదవి - ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వహక మండలి ఛైర్మన్​గా హర్షవర్ధన్​

ప్రపంచ ఆరోగ్య సంస్థ విధాన నిర్ణయాల్లో భారతదేశానికి ఇకపై పెద్దపాత్ర లభించనుంది. ఎందుకంటే ఈసారి డబ్ల్యూహెచ్​వో కార్యనిర్వాహక మండలి ఛైర్మన్​ పదవి భారత్​కు దక్కనుంది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, ఈఎన్​టీ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ హర్షవర్థన్​ ఈ నెల 22న ఈ పదవికి ఎన్నిక కానున్నారు.

harsh vardhan set to be who executive board chairman of WHO
ప్రపంచ ఆరోగ్య సంస్థలో భారత్‌కు కీలక పదవి

By

Published : May 20, 2020, 7:04 AM IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కార్యనిర్వాహక మండలి ఛైర్మన్‌ పదవి ఈసారి భారతదేశానికి లభించనుంది. ఆరోగ్యశాఖ మంత్రి, ఈఎన్‌టీ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఈనెల 22న ఈ పదవికి ఎన్నిక కానున్నారు. దీనిని చేపట్టడానికి మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఈ మండలిలోకి భారత్‌ను మూడేళ్ల పదవీకాలంతో ఎన్నుకోవాలనీ, ఛైర్మన్‌ పదవిని మాత్రం ఏడాదికొక ప్రాంతీయ కూటమి దేశానికి ఇవ్వాలని ఆగ్నేయాసియా సభ్య దేశాలు గత ఏడాదే తీర్మానించుకున్నాయి. ఆ ప్రకారం హర్షవర్ధన్‌ తొలి ఏడాది కాలం బోర్డు ఛైర్మన్‌గా ఉంటారు. తర్వాత రెండేళ్లు సభ్యుడిగా కొనసాగుతారు. 2016లో నాటి ఆరోగ్యశాఖ మంత్రి జె.పి.నడ్డా ఈ బోర్డు ఛైర్మన్‌ పదవిని నిర్వహించారు.

కీలకపాత్ర

డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌తో కలిసి బోర్డు పనిచేయాల్సి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ విధాన నిర్ణయాల్లో భారతదేశానికి ఇకపై పెద్దపాత్ర లభించనుంది. ప్రపంచ ఆరోగ్య సభ (డబ్ల్యూహెచ్‌ఏ) నిర్ణయాలను అమలు చేయించే పనిని బోర్డు చూస్తుంది. భారతదేశ ప్రతినిధిని బోర్డులో నియమించేందుకు మంగళవారం నాటి సమావేశంలో ఈ సభ ఆమోదం తెలిపింది. ప్రపంచ దేశాలు తీసుకువచ్చిన ఒత్తిడి మేరకు కరోనాపై స్వతంత్ర దర్యాప్తునకు డబ్ల్యూహెచ్‌ఏ మంగళవారం ఏకగ్రీవంగా తీర్మానించింది.

నిష్పాక్షికంగా తేల్చాలి: హర్షవర్ధన్‌

ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తరించడానికి దారితీసిన పరిణామాలపై డబ్ల్యూహెచ్‌వో నిష్పాక్షిక విచారణ జరపాలని హర్షవర్ధన్‌ దిల్లీలో డిమాండ్‌ చేశారు. 'భవిష్యత్తులో ఇలాంటి సంఘటనల నుంచి బయటపడడానికి ప్రపంచం ఎలా ముందస్తుగా సిద్ధం కావాలి? భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి అన్న విషయాలపై విస్తృత చర్చలు జరగాలి. డబ్ల్యూహెచ్‌ఓ దీనిపై దృష్టి సారిస్తుందన్న విశ్వాసం ఉంది' అని చెప్పారు.

ఇదీ చూడండి:తుపానును ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details