ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తోన్న అపాచీ హెలికాప్టర్లకు ఏమాత్రం తీసిపోకుండా స్వదేశీ పరిజ్ఞానంతో లోహ విహంగాలను తయారు చేసేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్). అవసరమైన అనుమతులు, ఇతర ప్రక్రియను ప్రారంభించింది. 2027 నాటికి సుమారు 10-12 టన్నుల బరువైన తొలి మధ్య స్థాయి మిలిటరీ హెలికాప్టర్‌ను తయారు చేసేందుకు ప్రణాళికలు చేస్తోంది.
ఈ మేరకు హెలికాప్టర్ల తయారీపై కీలక విషయాలు వెల్లడించారు హెచ్ఏఎల్ ఛైర్మన్ ఆర్ మాధవన్.
" రానున్న రోజుల్లో రూ.4 లక్షల కోట్లకు పైగా విలువైన మిలిటరీ హెలికాప్టర్ల దిగుమతులను తగ్గించుకోవటమే ఈ మెగా ప్రాజెక్ట్ లక్ష్యం. చాపర్ ప్రాథమిక డిజైన్‌ను ఇప్పటికే రూపొందించాం. ఈ ఏడాది ప్రభుత్వం అనుమతులు ఇస్తే.. 2023 నాటికి నమూనా చాపర్ తయారు చేయాలనుకుంటున్నాం. మొత్తం 500 యూనిట్లు ఉత్పత్తి చేయాలనుకుంటున్నాం. హెలికాప్టర్ డిజైన్‌తో పాటు నమూనా చాపర్ రూపొందించేందుకు సుమారు రూ.9,600 కోట్ల మేర నిధులు అవసరమవుతాయి. ఈ ఏడాదిలోనే అనుమతులు లభిస్తే.. 2027 నాటికి తొలి చాపర్‌ను తయారు చేస్తాం. "
- ఆర్. మాధవన్, హెచ్ఏఎల్ ఛైర్మన్, ఎండీ