వందమంది పడవలో కూర్చుని తెడ్డు తిప్పితే ఎలా ఉంటుందో తెలుసా...? కాలానికి పోటీ పడుతూ పరుగులు పెడుతూ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా..? కేరళలో నీటి ఉత్సవాల్లా ఉంటుంది. కేరళ రాష్ట్రం కొట్టాయంలో 120వ నీటి ఉత్సవాలు మీనచిలార్లోని తాజతంగాడి నదిలో ఘనంగా జరుగుతున్నాయి. వేర్వేరు ప్రాంతాల జట్లు పోటీ పడుతున్నాయి. ప్రకృతి ఒడిలో పడవల విన్యాసాల కేళి కట్టిపడేస్తోంది.
సంప్రదాయం 'పోటీ'పడిన వేళ
వందల ఏళ్లుగా సంప్రదాయ క్రీడగా భావిస్తున్న ఈ పడవ పోటీలను రాష్ట్ర పర్యటక శాఖ అధికారికంగా నిర్వహిస్తోంది. గెలిచిన వారికి 25 లక్షల రూపాయల భారీ బహుమతిని అందిస్తూ యువతను ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాశ్చ్యాత క్రీడలకు దీటుగా ఈ పోటీలకు ఆదరణ దక్కుతోంది. వందమంది పోటీ పడుతున్న ఈ క్రీడలను దగ్గర నుంచి చూసేందుకు వేలాది మంది తరలివస్తున్నారు.
పడవ పరిగెత్తింది
30కి పైగా పడవలు... 10 మీటర్ల వెడల్పు, 900 మీటర్ల పొడవుతో మూడు నిర్దేశిత వరుసలు... ఒక్కో పడవపై వందకు పైగా పోటీదారులు... ఒకే సారి తెడ్డు కదిపిన దృశ్యాలు వీక్షకులను కట్టిపడేశాయి.ఈ పోటీల్లో వేరువేరు విభాగాల్లో కేరళ పోలీసు శాఖ వారి బృందం, వియాపురం చుండన్ క్లబ్ బృందం, పల్లమతురుతి బోట్ క్లబ్ బృందాలు జయకేతనం ఎగురవేశాయి.