వస్తు సేవల పన్నులో మరిన్ని సంస్కరణలు వస్తాయని కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. రెవెన్యూ పెంచేందుకు రెండు స్లాబుల్లోనే జీఎస్టీని అమలు చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. 12, 18 శాతం పన్ను స్లాబులు మాత్రమే ఉంటాయని అంచనా వేశారు.
జీఎస్టీ ప్రారంభమయి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో జైట్లీ పలు విషయాలపై స్పందించారు.
"లగ్జరీ వస్తువులను మినహాయించి 28 శాతం స్లాబును పూర్తిగా తొలగించాం. 0, 5 శాతం స్లాబులు ఎప్పటికీ ఉంటాయి. భవిష్యత్తులో రెవెన్యూ పెరిగితే వీటిని 12, 18 శాతం స్లాబుల్లో కలిపి జీఎస్టీని రెండంచెల పన్నుగా మార్చొచ్చు."
-అరుణ్ జైట్లీ, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి
పెరుగుతున్న రెవెన్యూ
ఇటీవల కొన్ని వస్తువులపై అకస్మాత్తుగా పన్ను రేట్లను తగ్గించటం వల్ల ప్రభుత్వానికి చాలా ఆదాయం పడిపోయిందన్నారు జైట్లీ. ఈ పరిస్థితి నుంచి క్రమంగా కోలుకుంటున్నామని తెలిపారు.
"2017-18 (జులై-మార్చ్) సమయంలో నెలకు సగటు రెవెన్యూ రూ.89,700 కోట్లు. ఆ తర్వాత ఏడాది 2018-19కి 10 శాతం వృద్ధితో రూ.97,100 కోట్లకు పెరిగింది. రాష్ట్రాల పరంగా చూస్తే... ఈ రెండేళ్లలో 20 రాష్ట్రాల రెవెన్యూ 14 శాతం పెరిగింది. ఇదే కొనసాగితే రాష్ట్రాల రెవెన్యూ లోటును కేంద్రం భర్తీ చేయాల్సిన అవసరం ఉండదు."