కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన తొలి జీఎస్టీ మండలి భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సులభతర వాణిజ్యంలో భాగంగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసినట్లు రెవెన్యూ కార్యదర్శి ఏబీ పాండే తెలిపారు. కేవలం ఆధార్ కార్టుతో జీఎస్టీ రిజిస్ట్రేషన్‌కు వీలు కల్పించారు.
జీఎస్టీపై కీలక నిర్ణయాలు: ఆధార్‌తోనే రిజిస్ట్రేషన్ - వాణిజ్యం
జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇక సులభతరం కానుంది. అనేక రకాల పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేకుండా కేవలం ఆధార్ కార్డుతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దిల్లీలో జరిగిన 35వ జీఎస్టీ మండలి సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
సులభతర వాణిజ్యం సహా కీలక నిర్ణయాలు
"జీఎస్టీ మండలి ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్ విధానానికి ఆమోదం తెలిపింది. మల్టీ ఫ్లెక్స్‌ల్లో ఈ-టికెటింగ్‌కు కూడా ఆమోదముద్ర వేసింది. ప్రజలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సరైన ఆదాయం లభిస్తుంది. విద్యుత్ వాహనాలపై జీఎస్టీ పన్నుశాతం 12 నుంచి 5 శాతానికి, ఎలక్ట్రిక్ ఛార్జర్‌లపై పన్ను 18 నుంచి 12 శాతానికి తగ్గింపు అంశాన్ని ఫిట్‌మెంట్ కమిటీకి నివేదించాం."
-ఎ.బి.పాండే, కేంద్ర రెవెన్యూ కార్యదర్శి
కీలక నిర్ణయాలు...
- నేషనల్ యాంటీ ప్రాపిటరీ అథారిటీ పదవీ కాలం రెండేళ్లు పొడిగింపు.
- జీఎస్టీ పరిమితి 20 లక్షల నుంచి 40 లక్షలకు పెంపు.
- రిటర్న్స్ ఫైలింగ్ గడువు పెంపునకు నోటిఫికేషన్ ద్వారా కాకుండా చట్టంలో మార్పులు.
- వార్షిక రిటర్న్స్ ఫైలింగ్ గడువు 2 నెలల పాటు పెంపు.
- జీఎస్టీ కొత్త ఫైలింగ్ విధానానికీ మండలి ఆమోదం.
Last Updated : Jun 22, 2019, 8:23 AM IST