తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వైఫల్యాలను కప్పిపుచ్చడానికే శివకుమార్​ అరెస్ట్​'

మనీలాండరింగ్​ కేసులో అరెస్టు అయిన డీకే శివకుమార్​కు కాంగ్రెస్​ పార్టీ మద్దతుగా నిలిచింది. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే విపక్ష నేతల అరెస్టులు జరుగుతున్నాయని మండిపడింది. ప్రతీకార రాజకీయాల కోసం కేంద్ర సంస్థలను ప్రభుత్వం వినియోగించుకుంటోందని ఆరోపించారు కాంగ్రెస్​ నేతలు.

'వైఫల్యాలను కప్పిపుచ్చడానికే శివకుమార్​ అరెస్ట్​'

By

Published : Sep 4, 2019, 5:31 AM IST

Updated : Sep 29, 2019, 9:17 AM IST

'వైఫల్యాలను కప్పిపుచ్చడానికే శివకుమార్​ అరెస్ట్​'

కాంగ్రెస్​ సీనియర్​ నేత డీకే శివకుమార్​ అరెస్ట్​ను ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితులు అలుముకుంటున్న తరుణంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేంద్ర ప్రభుత్వం... తమ నేతలను అరెస్టు చేయిస్తోందని ఆరోపించింది. శివకుమార్​ అరెస్ట్​పై న్యాయపోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది హస్తం పార్టీ.

గతేడాది సెప్టెంబరులో మనీ లాండరింగ్‌ ఆరోపణలపై శివకుమార్‌ సహా దిల్లీలోని కర్ణాటక భవన్​ అధికారి హనుమంతప్పపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో దిల్లీలో నాలుగుసార్లు ప్రశ్నించిన అనంతరం ఆయనను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు అధికారులు. తాను ఎలాంటి తప్పు చేయలేదంటున్న శివకుమార్‌...గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కీలకంగా వ్యవహరించినందుకే కేంద్రం తనపై ఈడీ, ఐటీ సంస్థలను ప్రయోగిస్తోందని ఆరోపించారు.

కాంగ్రెస్​ ట్రబుల్​ షూటర్​గా పేరొందిన శివకుమార్​కు కర్ణాటకలోని విపక్ష నేతలు మద్దతుగా నిలిచారు. శివకుమార్​ అరెస్ట్​ను ఖండించిన నేతలు.. కేంద్ర సంస్థలను ఉపయోగించి భావవ్యక్తీకరణ స్వేచ్ఛను భాజపా హరింపజేస్తోందని ఆరోపించారు.

"తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేంద్రం ఇలాంటి చర్యలు చేపడుతోంది. భాజపా ప్రతీకార రాజకీయాల్లో శివకుమార్​ కుడా ఓ బాధితుడు. శివకుమార్​ కచ్చితంగా నిర్ధోషిగా బయటకు వస్తారు. భాజపా చేస్తున్న కుట్రలు ప్రజలకు అర్థమవుతాయి.​"
--- సిద్ధరామయ్య, సీనియర్​ కాంగ్రెస్​ నేత.

"వినాయక చవితి రోజునా శివకుమార్​కు ఈడీ విరామం ఇవ్వలేదు. తమకు వ్యతిరేకమని భావిస్తున్న నేతలను అణచివేయడానికి కేంద్ర సంస్థలను భాజపా వినియోగిస్తోంది."
--- కుమారస్వామి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి.

శివకుమార్​ అరెస్ట్​ను కర్ణాటక కాంగ్రెస్​, యూత్​ కాంగ్రెస్​ సభ్యులు ఖండించారు. కాంగ్రెస్​ సీనియర్​ నేత అరెస్ట్​కు వ్యతిరేకంగా బుధవారం నిరసనలు చేపట్టనున్నట్టు ప్రకటించారు.

మరోవైపు మనీలాండరింగ్​ కేసులో అరెస్ట్​ అయిన డీకే శివకుమార్​ను బుధవారం కోర్టులో హజరుపరిచి కస్టడీ కోరనుంది ఈడీ.

Last Updated : Sep 29, 2019, 9:17 AM IST

ABOUT THE AUTHOR

...view details