ప్రపంచవ్యాప్తంగా 21వేలకుపైగా ప్రాణాలు తీసి, భారత్‌లో 600 మందికి సోకిన కరోనా మహమ్మారిపై పోరాటానికి ప్రభుత్వం వలంటీర్ వైద్యుల కోసం వెతుకుతోంది. సమీప భవిష్యత్తులో ప్రభుత్వ, శిక్షణా ఆసుపత్రుల్లో తమ సేవలను అందించడానికి తగిన విధంగా, సిద్ధంగా ఉన్న వలంటీర్లు ముందుకు రావాలని నీతిఆయోగ్ వెబ్సైట్లో ప్రకటన చేసింది.
"ప్రాణాంతక కరోనా వైరస్‌తో పోరాడటానికి... పదవీ విరమణ చేసిన ప్రభుత్వ, సాయుధ దళాల వైద్యులు, ప్రైవేటు డాక్టర్లు ముందుకు వచ్చి ప్రభుత్వం చేస్తున్న కృషిలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి."
- నీతి ఆయోగ్ వెబ్సైట్లో చేసిన ప్రకటన
ఈ విపత్తు సమయంలో దేశానికి తమ వంతు సేవలు అందించాలనుకునేవారు ... నీతి ఆయోగ్ అధికారిక వెబ్సైట్లో అందించిన లింక్ ద్వారా నమోదు చేసుకోవాలి.
పెనుభారం
కరోనా దేశవ్యాప్తంగా చాపకింద నీరులా పాకుతూనే ఉంది. దీనితో దేశం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటోంది. పెద్ద సంఖ్యలో వస్తున్న రోగులను చూసుకోవడానికి ఉన్న వైద్యులు సరిపోవడం లేదు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలను మరింత వేగవంతంగా పెంచాలని భావిస్తున్నాయి. దీనితో వైద్యులపై తీవ్రమైన భారం పడుతోంది.