దిల్లీలో నిరసనలు చేస్తున్న రైతుల గురించి ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. అతి శీతల వాతావరణంలో, కరోనా పరిస్థితుల్లో.. నిరసనలు మంచిది కాదని అభిప్రాయపడ్డారు. తక్షణమే ఆందోళనలు విరమించి కేంద్రం పంపిన ప్రతిపాదనలను పరిశీలించాలని సూచించారు. రైతులతో చర్చించేందుకు, ప్రతి అంశంపై వివరణ ఇచ్చేందుకు కేంద్రం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందని తోమర్ పునరుద్ఘాటించారు. సాగు చట్టాల్లో తమ అభ్యంతరాలపై సలహాలు ఇస్తారని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
వారివి భయాలే..
కొత్త వ్యవసాయ చట్టాలతో కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)పై ఎలాంటి ప్రభావం పడదని చర్చల సందర్భంగా స్పష్టం చేసినట్లు తోమర్ పేర్కొన్నారు. కానీ.. రైతులు భయపడుతున్నారని, వారు చట్టాలను రద్దు చేయాలన్న దగ్గరే ఆగిపోయారని అన్నారు. యూరియా బ్లాక్ మార్కెట్‌ను అడ్డుకున్నామని తెలిపిన ఆయన.. మోదీ సర్కార్ రైతుల కోసం ఎన్నో సంస్కరణలు తెచ్చిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు.. స్వేచ్ఛాయుత పంట విక్రయాలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. నూతన సాగు చట్టాలతో రైతులు తమ పంటను ఎక్కడైనా, ఎవరికైనా.. తమకు నచ్చిన ధరకు విక్రయించే అవకాశం ఉంటుందని భరోసా కల్పించారు.
రైతులు తమ భూమి పారిశ్రామికవేత్తల వశమయ్యే అవకాశం ఉందని భయపడుతున్నారని, కానీ ఇది జరగదని అన్నారు. మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటక, పంజాబ్, గుజరాత్లో ఎప్పటినుంచో కాంట్రాక్ట్ ఫార్మింగ్ కొనసాగుతోందని, అక్కడ ఇప్పటివరకు అలాంటి సమస్యలేవీ రాలేదని తోమర్ తెలిపారు. వ్యవసాయ చట్టాలు చేసే హక్కు తమకు ఉందని పేర్కొన్నారు.
''మేం రైతులకు ఓ ప్రతిపాదన పంపాం. అయితే వారు చట్టాలను రద్దు చేయాలనే పట్టుబడుతున్నారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న నిబంధనలపై చర్చించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ చట్టాలతో కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ), ఏపీఎంసీపై ప్రభావం పడదు. ఇదే మేం రైతులకు వివరించాలని అనుకుంటున్నాం.