కరోనా మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో వలస కార్మికులకు ఉపశమనం కల్పించేలా ఉచిత రేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్థిక ప్యాకేజీ 2.0లో వలస కార్మికులు, వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా ఉన్న ప్రకటనలపై ఈటీవీ భారత్తో తన అభిప్రాయాలు పంచుకున్నారు వ్యవసాయ రంగ నిపుణులు దేవిందర్ శర్మ.
'వలస కూలీలకు ఉచిత రేషన్ స్వాగతించదగ్గ చర్య' - Devinder sharma on economic package
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ 2.0లో వలస కార్మికులకు ఉచిత రేషన్ ద్వారా ఉపశమనం, ఒకే దేశం ఒకే రేషన్ కార్డు పథకం తీసుకురావటం సానుకూల అంశాలని పేర్కొన్నారు వ్యవసాయ రంగ నిపుణులు దేవిందర్ శర్మ. వ్యవసాయ రంగంలో ద్రవ్య లభ్యత పెంచటం స్వాగతించే చర్యగా చెప్పారు. ఈటీవీ భారత్తో ముఖాముఖిలో పలు విషయాలు పంచుకున్నారు.
"రేషన్ కార్డు లేని వారికీ రెండు నెలల పాటు ఉచితంగా 5 కిలోల బియ్యం, ఒక కిలో పప్పు ఇవ్వటం స్వాగతించదగ్గ నిర్ణయం. ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు పథకంపై ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటన చేయటం సానుకూల అంశం. ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో వ్యవసాయానికి మరింత ఊతమిచ్చేలా ప్యాకేజీ రావాలని కోరుకున్నాము. రైతులకు నేరుగా నగదు ఇవ్వడం మంచిదని అనుకున్నాం. కానీ అది ఆర్థిక మంత్రి ప్రకటనలో లేదు. కిసాన్ క్రెడిట్ కార్డుల రుణాలను మరో రూ. 2 లక్షల కోట్లు పెంచుతామని కేంద్ర ప్రకటించింది. దాంతో 2.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతారు" అని తెలిపారు దేవిందర్.