ఆయుర్వేదానికి సంబంధించిన పలు కోర్సుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన విద్యార్థులు శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అపాయం లేని కణతులను తొలగింపు, ముక్కు, కంటి శుక్లాల నిర్మూలన, వ్రణ విచ్ఛేదనం వంటి శస్త్రచికిత్సలకు శిక్షణ అందించేందుకు అనుమతించే విధంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్(సీసీఐఎం) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్(పోస్ట్ గ్రాడ్యూయేట్ ఆయుర్వేద ఎడ్యుకేషన్) నిబంధనలకు సవరణలు చేస్తూ 39 సాధారణ శస్త్రచికిత్సలు, 19 చికిత్స విధానాలను అందులోకి చేర్చింది.
అయితే సీసీఐఎం విడుదల చేసిన నోటిఫికేషన్ కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ కొటేచా స్పష్టం చేశారు.
"ఆయుర్వేద ప్రాక్టీషనర్లను శస్త్రచికిత్స రంగంలోకి పూర్తిగా అనుమతించడం ఈ నోటిఫికేషన్ ఉద్దేశం కాదు. ఆయుర్వేదంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యకు సంబంధించిన ప్రస్తుత నిబంధనలను ఇది క్రమబద్ధీకరిస్తుంది. ఆయుర్వేదంలో పీజీ చేసిన ప్రతీ ఒక్కరికి ఇది వర్తించదు. శల్య, శాలక్యలో నైపుణ్యం ఉన్నవారికే ఈ శస్త్రచికిత్సలు నిర్వహించే అనుమతి ఉంటుంది."
-రాజేష్ కొటేచా, ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి
సీసీఐఎం బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్ వైద్య జయంత్ దేవ్‌పూజారి సైతం ఈ నోటిఫికేషన్‌పై వివరణ ఇచ్చారు. ఆయుర్వేద సంస్థల్లో గత 20 సంవత్సరాలుగా ఈ విధానాలు కొనసాగుతున్నాయని, ప్రస్తుత నోటిఫికేషన్ వాటిని చట్టబద్ధం చేస్తుందని చెప్పారు. దీని ద్వారా ఆయుర్వేద ప్రాక్టీషనర్లు శస్త్రచికిత్సల విధివిధానాలను తగిన నియంత్రణతో పాటించే అవకాశం ఉందని తెలిపారు.