ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో చాలా దేశాలు లాక్‌డౌన్ విధించాయి. ఈ కారణంగా కోట్లాది మంది ఇళ్లలోనే ఉండాల్సి వస్తోంది. ఇలా ఇళ్లలోనే ఉంటున్న వారు వీడియో కాల్‌లో తమకు ఇష్టమైన వారితో మాట్లాడుతున్నారు. అయితే గ్రూప్ వీడియో కాల్‌లో మాట్లాడేందుకు పరిమిత సంఖ్యలో మాత్రమే అవకాశం ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు టెక్ దిగ్గజం గూగుల్ సరికొత్త అప్‌డేట్‌ను తీసుకువచ్చింది. గూగుల్ డ్యుయో చాట్ యాప్ ద్వారా ఒకేసారి 12 మందితో వీడియో కాల్ మాట్లాడే అవకాశాన్ని కల్పించింది. దీని ద్వారా సామాజిక దూరాన్నీ ప్రోత్సహించినట్లవుతుందని గూగుల్ భావిస్తోంది.
"గూగుల్ డ్యుయో వినియోగదారులు ప్రపంచవ్యాప్తంగా తమకు ఇష్టమైన వారిని చూసేందుకు మేం సహాయం చేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో వీడియోకాలింగ్ ప్రాముఖ్యతను గుర్తించాం. అందుకే గ్రూప్ కాలింగ్ సభ్యుల పరిమితిని 8 నుంచి 12కు పెంచాం. నేటి నుంచే ఇది అందుబాటులో ఉంటుంది. ఇంకా ఎన్నో ఫీచర్లు వస్తూనే ఉంటాయి."