కేరళలో తీవ్ర కలకలం సృష్టించిన బంగారం అక్రమ రవాణా కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా స్వప్న సురేశ్ పేరిట ఉన్న రెండు బ్యాంక్ లాకర్ల నుంచి రూ.1కోటి, 1కేజీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసులో స్వప్న రెండో ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటోంది.
రిమాండ్ రిపోర్టును కోర్టుకు అందజేసిన ఎన్‌ఐఏ.. పలు విషయాలు వెల్లడించింది. తిరువనంతపురంలోని ఫెడరల్ బ్యాంక్‌లో స్వప్న పేరుతో రూ.36.5 లక్షలు ఉన్నట్లు తెలిపింది. మరో రూ.64 లక్షలు, 982.5 గ్రాముల బంగారం ఆభరణాలను అదే ప్రాంతంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గుర్తించినట్లు స్పష్టం చేసింది.
కోర్టుకు హాజరైన స్వప్న తరఫు న్యాయవాది.. ఆ ఆభరణాలు దుబాయ్‌లోని ఓ షేక్ పెళ్లి కానుకగా ఇచ్చినట్లు తెలిపారు. కోర్టుకు హాజరైన స్వప్న.. కస్టమ్స్ అధికారులు తనను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నారని కోర్టుకు విన్నవించింది. వాదోపవాదనలు విన్న న్యాయస్థానం స్వప్నను కలిసేందుకు తన పిల్లలకు అనుమతి ఇచ్చింది.