గణపతి పాలు తాగాడు, దేవతా విగ్రహాలు కళ్లు తెరిచాయన్న వార్తలు తరచూ వింటూనే ఉంటాం. ఈ విషయాలు విన్న భక్తులు వెంటనే ఆ ప్రాంతాలకు తరలి వెళ్తారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలోని హుబ్బళ్లిలో జరిగింది. మంటూర్ ప్రాంతంలోని నల్లమ్మదేవి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతోంది. ఆలయంలోని విగ్రహం కళ్లుతెరిచిందని వారి విశ్వాసం. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
దేవత విగ్రహానికి వెండితో తయారు చేసిన కళ్లు ఉండేవి. ఇటీవలే వాటిని గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారు. ఈ ఘటన అనంతరం దేవాలయాన్ని అర్చకులు మూసివేశారు. మంగళవారం సాయంత్రం ఆలయాన్ని తెరిచిన సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కళ్లతో ఉన్న నల్లమ్మదేవి విగ్రహం వారికి దర్శనమివ్వడమే ఇందుకు కారణం. ఇది తెలుసుకున్న భక్తులు... ఆలయానికి పోటెత్తుతున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.