అల్లా మహిమ! ఈ 'బకరా' ఎంతో అమూల్యం అప్పుడే 'బక్రీద్ ముబారక్' అంటూ బకరాల సందడి షురూ అయ్యింది. మేలైన, విభిన్నమైన, ప్రత్యేకతలున్న మేకపోతులు మార్కెట్లోకి వచ్చేశాయి. బక్రీద్ అనగానే మేకలకు ధర బాగా పెరుగుతుంది. లక్షల్లో పలికే పోతులున్నాయి. దిల్లీలోని వెల్కమ్ పీలీమిట్టీ మార్కెట్లో ఓ రెండు మేకల ఖరీదు అక్షరాల 4 లక్షల రూపాయలు.
ఎందుకింత రేటు?
ఉత్తర-తూర్పు దిల్లీలోని పీలీమిట్టీ మార్కెట్లో రెండు మేకలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అల్లా-మొహమ్మద్ అని ఉర్దూలో రాసినట్టు ఉన్నాయి వాటి శరీరంపై ఉన్న మచ్చలు. మరో మేక శరీరంపై చాంద్(చందమామ) ఆకారం కనిపిస్తుంది. బక్రీద్ రోజు ఇలాంటి ప్రత్యేకతలు గల మేకపోతులను బలిస్తే శుభం కలుగుతుందని భావించేవారు చాలా మందే ఉన్నారు. పుట్టుకతోనే అల్లా గుర్తులను శరీరంపై ముద్రించుకు పుట్టినట్టు కనిపిస్తున్న ఈ మేకలకు అందుకే భారీ డిమాండ్ నెలకొంది.
ఆ మేకల యజమాని ప్రస్తుతం వాటికి 4 లక్షల ధర ఖరారు చేశారు. అనుకున్న ధర వస్తేగానీ అల్లా-మొహమ్మద్, చాంద్ మేకలను అమ్మలేను అంటున్నారు.
ప్రతి సంవత్సరంలాగే ఈసారీ బక్రీద్ సందర్భంగా మేకపోతులకు డిమాండ్ బాగా పెరిగింది. ఇక ఏమైనా ప్రత్యేకత ఉంటే చాలు వ్యాపారులు వారికి అనుకూలంగా మలుచుకుని ఖరీదును అమాంతం ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
బకరాల కిటకిటతో-కాసుల పంట
దిల్లీలోని పీలీమిట్టి మార్కెట్ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విక్రయదారులతో కళకళలాడుతోంది. ఒక్కొక్కరి వద్ద 2 నుంచి డజనుల సంఖ్యలో మేకలున్నాయి. ఇక్కడ వ్యాపారం జరిగిన తర్వాత విక్రయదారులు సొమ్ముదాచుకోవటంలో అప్రమత్తంగా ఉండాలి. అంటే ఈ రెండు మూడు రోజుల్లో వారి బిజినెస్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఈద్-కోసం..
మేకల మార్కెట్ ఉండే రోడ్ నంబర్ 66 ఒక భాగం పూర్తిగా మేకలకే కేటాయించారు. ఇక్కడ పోలీసులు రద్దీని అదుపులో ఉంచుతారు. సిలమ్పుర్, జాకరాబాద్, వెల్కమ్ పీలీమిట్టిలలో మేకల విక్రయాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
"దూర ప్రాంతాల నుంచి మేకలను అమ్ముకునేందుకు వచ్చిన వారి కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పించాం. వర్షం, ఎండ నుంచి మేకలకు ఇబ్బంది కలగకుండా ప్లాస్టిక్ షెడ్లు వేశాం. వాటికి తాగడానికి నీరు అందుబాటులో ఉంచాం. "
-అమన్ ఏక్తా కమిటీ చైర్మెన్
ఇదీ చూడండి: చిరునవ్వుల చిన్నమ్మకు వినూత్న నివాళి!