భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి రావత్ సీడీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. భారత సైన్యాధ్యక్షుడిగా పదవీ విరమణ చేయనున్నారు.
భారత తొలి సీడీఎస్‌గా బిపిన్ రావత్ నియామకం - CHIEF OF DEFENCE RAWATH
భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా సైన్యాధ్యక్షుడు బిపిన్ రావత్ నియమితులయ్యారు. రేపటి నుంచి సీడీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
సైన్యాధ్యక్షుడి కంటే ముందు పలు కీలక విధులు నిర్వహించారు రావత్. పాకిస్థాన్ సరిహద్దులోని నియంత్రణ రేఖ, చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖల వద్ద కీలక బాధ్యతలు చేపట్టారు. భారత త్రివిధ దళాలను మరింత పటిష్ఠం చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖకు సలహాదారునిగా వ్యవహరించే సీడీఎస్ ఏర్పాటుకు కేబినెట్ కమిటీ ఇటీవలే ఆమోదం తెలిపింది.
ఇప్పటికే సీడీఎస్‌కు సంబంధించి గరిష్ఠ వయోపరిమితిని 65 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం సైన్యం, నౌకాదళం, వాయుసేన అధిపతులు గరిష్ఠంగా మూడేళ్లపాటు లేదా 62 ఏళ్ల వయసు వచ్చే వరకు (ఏది ముందయితే అది) పదవుల్లో కొనసాగుతున్నారు. వారిలో ఎవరైనా సీడీఎస్‌గా నియమితులైతే 65 ఏళ్ల వరకు ఆ పదవిలో కొనసాగేందుకు వీలుగా సైన్యం, నౌకాదళం, వాయుసేన సర్వీసు నిబంధనలను రక్షణ శాఖ తాజాగా సవరించింది.