తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గాంధీ 150: బాపూ సత్యాగ్రహాన్ని విస్మరించిన నేటి తరం - మహాత్మ

తన జీవితం ద్వారా మానవాళికి మహాత్ముడు ఇచ్చిన గొప్ప బహుమతి.. సత్యాగ్రహ బోధన, సాధన. సత్యాగ్రహం అంతిమ లక్ష్యం దేశ స్వాతంత్ర్యం మాత్రమే కాదు... సమాజంలో మార్పు కూడా. సత్యాగ్రహం ద్వారా మహాత్ముడు నాటి సమాజంలో నెలకొల్పిన విలువలేంటి? గాంధీజీ కలలు కన్న ప్రాథమిక సామాజిక మార్పు ఎందుకు కనబడలేదు? మన సమాజం శాంతి, సామరస్యంతో ఉండాలంటే ఏం చేయాలి?

గాంధీ 150: బాపూ సత్యాగ్రహాన్ని విస్మరించిన నేటి తరం

By

Published : Sep 7, 2019, 7:01 AM IST

Updated : Sep 29, 2019, 5:55 PM IST

అన్యాయానికి వ్యతిరేకంగా గాంధీజీ రూపొందించిన ప్రత్యేక సాధనం 'సత్యాగ్రహం'. 50 ఏళ్ల సత్యశోధన ఫలితం... ఈ ఆయుధం. సత్యాగ్రహం ఉద్యమంతో.. దేశ ప్రజలను ఐక్యం చేసిన బాపూజీ బ్రిటిషర్ల నుంచి దేశాన్ని విముక్తి చేశారు.

తనతో సత్యాగ్రహం ఉద్యమంలో పాల్గొనాలని.. సబర్మతి ఆశ్రమం, వార్దా సేవాగ్రామ్‌లో ఉండాలనుకునే వారికి మహాత్ముడు 11 కఠిన నియమాలను నిర్దేశించారు. ఈ నియామావళికి గాంధీజీ శిష్యుడు వినోబా భావే `ఏకాదశ వ్రతా` అనే పేరు పెట్టారు. మహాత్ముడి నుంచి స్ఫూర్తి పొందిన దేశంలోని అనేక ఆశ్రమాలు.. ఈ నియమాలను అమలు చేశాయి.

దేశ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనడానికి ముందు సంపాదన కోసం గాంధీజీ 20 ఏళ్లపాటు దక్షిణాఫ్రికాలో ఉన్నారు. కానీ అక్కడ నల్లజాతీయుల పరిస్థితిని చూసి చలించిపోయారు. డబ్బులు తెచ్చే న్యాయవాద వృత్తిని పక్కనపెట్టి.. అహింసాయుత పోరాటాలు చేశారు. నల్ల జాతీయుల హక్కుల సాధన కోసం కృషి చేశారు. ఈ ఉద్యమమే కొన్ని మార్పులతో సత్యాగ్రహమైంది.

సత్యం, అహింస, పోరాట సాధనాలు మాత్రమే కాదు.. అవి మహాత్ముడి జీవనతత్వాలు.

సత్యాగ్రహం అంటే ప్రతీకారం కాదు..

సత్యాగ్రహాన్ని పాటించేవారికి గాంధీజీ కొన్ని విలువైన, కఠిన సూచనలు చేశారు. సత్యాగ్రహులు ఎలాంటి అన్యాయాన్నైనా సహించరాదు. బాధల్ని ఇష్టంగా స్వీకరించాలి. పిరికితనానికి చోటులేదు. పోరాటాలు అన్యాయం చేసే వ్యవస్థకు వ్యతిరేకంగా ఉండాలి. ఉద్యమాలు వ్యక్తిగతంగా ఉండరాదు. సత్యాగ్రహమంటే ప్రతీకారం తీర్చుకోవడం కాదు. ప్రత్యర్థిని శిక్షించడం కాదు. సమాజంలో ఆలోచనాపరులు, దుర్మార్గులు ఉంటారు. మొత్తం సమాజం ఎప్పటికీ చెడ్డది కాదనే విషయాన్ని గ్రహించాలి. అన్యాయాన్ని ఎదిరించే క్రమంలో బాధల్ని స్వచ్ఛంధంగా భరించాలి. అది ప్రత్యర్థి హృదయాలను కదిలించేందుకు సమర్థవంతమైన మార్గం.

లక్ష్య సాధనం కోసం గాంధీజీ ఎన్నోసార్లు సత్యాగ్రహం చేశారు. కాలానుగుణంగా, పరిస్థితులకు తగినట్లు.. పోరాట విధానాన్ని మార్చుకున్నారు. సత్యాగ్రహం దశ, దిశపై బాపూజీ నిరంతరం ఆలోచిస్తూ ఉండేవారు. వ్యాసాలు, ప్రసంగాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. సత్యాగ్రహంలో తాను నైపుణ్యం సాధించానని గాంధీజీ చెప్పుకున్నారు. అయితే సత్యాగ్రహంపై తాను చెప్పిన విధానాలే అంతిమం కాదని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేయాలని సూచించారు. సత్యం, ప్రేమ, స్వచ్ఛమైన ఆత్మ, శక్తిని ప్రపంచం గ్రహించడం ద్వారా సత్యాగ్రహంలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తాయన్నది గాంధీ నమ్మకం.

ప్రత్యర్థి సైతం సత్యాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకోవడమే సత్యాగ్రహం అంతిమ లక్ష్యమనేది గాంధీ భావన. అందుకే అన్యాయంపై ప్రత్యర్థులతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. అన్యాయం ఏ వ్యవస్థలో.. ఏ రూపంలో ఉన్నా సత్యాగ్రహం సహించదు.

దేశవ్యాప్తంగా మద్దతు..

గాంధీజీ నాయకత్వంలో ఎన్నో సత్యాగ్రహ ఉద్యమాలు జరిగాయి. 1919 నుంచి 1922 వరకు సహాయ నిరాకరణ ఉద్యమం, 1930 నుంచి 34 వరకు శాసనోల్లంఘన పోరాటాలు జరిగాయి. కఠిన సత్యాగ్రహ నియమాలను పాటించడం వల్ల.. ప్రజలు సైతం క్రమశిక్షణకు అలవాటుపడ్డారు. సత్యాగ్రహ ఉద్యమాల్లో స్వచ్ఛందంగా పాల్గొన్న లక్షలమంది ప్రజలు, సత్యాగ్రహులతో పాటు అన్ని రకాల ఇబ్బందులను ఇష్టంగా స్వీకరించారు. ఈ అపూర్వ క్రియాశీల ఉద్యమాలు విజయ తీరాలకు చేరాయి.

సహాయ నిరాకరణ ఉద్యమంలో విద్యావంతులైన మధ్యతరగతి ప్రజలు భారీగా పాల్గొన్నారు. శాసనోల్లంఘన నాటికి మహిళలు సైతం పోరుబాట పట్టారు. అన్యాయానికి వ్యతిరేకంగా అహింసా మార్గంలో నిరసన తెలిపే అత్యున్నత వేదిక సత్యాగ్రహమని ప్రజలందరూ గ్రహించారు.

దేశాన్ని కదిలించిన సత్యాగ్రహ ఉద్యమాలే కాదు.. పరిమితస్థాయిలో జరిగిన అనేక పోరాటాలూ వేల మందికి మేలు చేశాయి. కేరళలో బలవంతపు వ్యవసాయానికి వ్యతిరేకంగా చంపారన్‌ సత్యాగ్రహం జరిగింది. వ్యాంకో సత్యాగ్రహం.. దళితుల కోసం దేవాలయ తలుపులు తెరిచింది. బార్దోలి సత్యాగ్రహం వల్ల భూమి శిస్తు రద్దు చేశారు. ప్రాంతీయ సమస్యలకు పరిష్కారాలు చూపిన ఈ సత్యాగ్రహ ఉద్యమాలు.. స్వతంత్ర సంగ్రామం అనే అంతిమ లక్ష్యానికి దారులు చూపాయి. చిన్న, పెద్ద, బీద, ధనిక సహా.. కులాలు, మతాలకు అతీతంగా ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను పెంచాయి.

కాంగ్రెస్​పై ప్రభావం...

బార్దోలి శాసనోల్లంఘన సత్యాగ్రహాన్ని చేపట్టడానికి ముందు నుంచే మహాత్ముడు చర్కా చేతబట్టి నూలు ఉలికి ఖాదీనేసేవారు. అంటరానితనాన్ని సహించరాదని, అందరికీ విద్య అందించాలనే షరతులను కాంగ్రెస్‌ కార్యకార్తలకు నిర్దేశించారు. ఈ పనులతో అన్ని వర్గాల ఆమోదాన్ని పొందారు.

స్వాతంత్ర్యోద్యమంలో గాంధీజీ గౌరవనీయమైన స్థానం సంపాదించారు. బాపూజీ దృష్టిలో దేశాన్ని స్వతంత్రం తీసుకురావడమే కాదు.. సమాజంలో ప్రాథమిక మార్పులు సాధించడమూ అహింసా పోరాట లక్ష్యం. దక్షిణాఫ్రికా నుంచి భారత్‌ తిరిగివచ్చిన తర్వాత ఇలా గాంధీజీ చేపట్టిన నిర్మాణాత్మక కార్యక్రమాలను జాతీయ కాంగ్రెస్‌ను ప్రభావితం చేశాయి.

భారత దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడానికి కాంగ్రెస్‌.. బ్రిటిష్‌ పాలకులకు ఏడాది గడువు ఇచ్చింది. లేదంటే తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించింది. బ్రిటిషర్లపై మరింత ఒత్తిడి కోసం పలు వర్గాలు స్వాతంత్ర్య పోరాటంలో మరింత క్రియాశీలకంగా పోరాడాలని గాంధీజీ సూచించారు. కాంగ్రెస్‌ రాజకీయ కార్యకర్తలకు నిర్మాణాత్మక కార్యక్రమాల అమలు బాధ్యతలు అప్పగించాలని తెలిపారు. మత సామరస్యాన్ని ప్రోత్సహించడం, అంటరానితనంపై పోరాటం, ఖాదీ, కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహమిచ్చే కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. రైతులు, కార్మిక సంఘాలకు సంబంధించిన కార్యక్రమాలు సైతం వామపక్ష నాయకుల ఒత్తిడి మేరకు చేర్చారు.

ప్రేమతో విజయం...

చర్ఖా సంఘం, గ్రామోద్యోగ్‌ సంఘం, హరిజన్‌ సేవక్‌ సంఘం, గో సేవా సంఘం, రాష్ట్ర భాషా ప్రచార సమితి, ఆదిమ జాతి సంఘం, మజూర్‌ మహాజన్‌ వంటి సంస్థలు ఏర్పాటు ఒక్కటి చేశారు. అవి సమన్వయంతో పనిచేసేందుకు.. కాంగ్రెస్‌ కార్యకర్తలను పర్యవేక్షకులుగా నియమించారు.

మహాత్ముడి బాటలో నడిచి ఉంటే...

సత్యాగ్రహం ద్వారా అణగారిన వర్గాలకు మేలు చేసే సమర్థవంతమైన మార్గాన్ని మహాత్ముడు ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రజల్ని దోపిడీ నుంచి విముక్తి చేయడం వల్ల.. వారిలో ఆత్మ విశ్వాసం నింపారు. అత్యాశ, భయాన్ని ప్రేమ ద్వారా జయించవచ్చని సత్యాగ్రహం నిరూపించింది. దురదృష్టమేమిటంటే.. గాంధీజీ ప్రణాళికను, దూరదృష్టిని కాంగ్రెస్‌ అర్థం చేసుకోలేకపోయింది. గాంధీజీ నేతృత్వంలో ఐక్యమైన సంఘాలు అహింసాయుత ఉద్యమం చేశాయి. కానీ.. రాజకీయంగా కాంగ్రెస్‌ వాటికి సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు. స్వాతంత్ర్యం వచ్చిన ఐదు నెలలకే గాంధీజీ హత్యకు గురవడం వల్ల సత్యాగ్రహ ఉద్యమం ముగిసింది. సమాజంలో ప్రాథమిక మార్పు కోసం అంటూ ఆయన కలలు కన్న సత్యాగ్రహం విలువలు నేటి తరానికి అందలేదు. ఆనాడే కాంగ్రెస్‌ మహాత్ముడిని అనుసరించి ఉంటే.. ప్రస్తుతం దేశంలో ఇంత గందరగోళం నెలకొని ఉండేదికాదు.

---నచికేత దేశాయ్​

Last Updated : Sep 29, 2019, 5:55 PM IST

ABOUT THE AUTHOR

...view details