తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గగన్​యాన్ వ్యోమగాములకు భారత్​లోనూ శిక్షణ - గగన్​యాన్ వార్తలు

గగన్​యాన్ ప్రాజెక్టుకు ఎంపికైన వ్యోమగాములకు భారత్​లోనూ కఠినమైన శిక్షణ కొనసాగనుంది. ప్రస్తుతం రష్యాలో శిక్షణ పొందుతున్న వీరు వచ్చే ఏడాది ప్రారంభంలో స్వదేశానికి రానున్నారు. వీరికి భారత త్రివిధ దళాలకు చెందిన సంస్థలు శిక్షణ ఇవ్వనున్నాయి.

gaganyaan
గగన్​యాన్ వ్యోమగాములకు భారత్​లోనూ శిక్షణ

By

Published : Nov 5, 2020, 8:18 AM IST

గగన్​యాన్ ప్రాజెక్టు కోసం రష్యాలో శిక్షణ పొందుతున్న వ్యోమగాములు భారత్​లోనూ తమ ట్రైనింగ్​ను కొనసాగించనున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో రష్యా నుంచి తిరిగిరానున్న వీరు.. బెంగళూరు, ముంబయి, పుణెలో నిర్వహించే కఠినమైన శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఇస్రోతో ఒప్పందం ప్రకారం గగన్​యాన్​కు వ్యోమగాముల ఎంపికకు సహకరించిన భారత వాయుసేన వీరి శిక్షణను చూసుకోనుంది. బెంగళూరులోని ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్(ఐఏఎం) సంస్థలో వీరు తర్ఫీదు పొందనున్నారు.

భారత సైన్యానికి చెందిన పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్​ ఇన్​స్టిట్యూట్(ఏఎస్ఐ), నావికాదళానికి చెందిన ముంబయిలోని ఇన్​స్టిట్యూట్ ఆఫ్ నావల్ మెడిసిన్(ఐఎన్ఎం) సంస్థలు సైతం వ్యోమగాములకు శిక్షణ ఇవ్వనున్నాయి. వివిధ పరిస్థితుల్లో మనుగడ సాగించేలా ఆర్మీ, నేవీ సంస్థలు.. సంబంధిత శిక్షణ ఇస్తాయని ఇస్రో ఛైర్మన్ కే శివన్ చెప్పారు.

కఠినమైన రోజూవారీ కార్యక్రమాలతో పాటు శారీరక దారుడ్యం పెంపొందించేందుకు ఏఎస్ఐ శిక్షణ ఇవ్వనుండగా.. అండర్-వాటర్ సిమ్యులేటర్లు, ఇతర వ్యవస్థలను ఉపయోగించి మైక్రోగ్రావిటీపై.. ఐఎన్ఎం శిక్షణ ఇస్తుందని అధికారులు తెలిపారు.

"ఎంపిక చేసిన వ్యోమగాములకు రష్యా ఇచ్చిన శిక్షణ సాధారణమైనది. తిరిగొచ్చిన తర్వాత వీరికి గగన్​యాన్​ కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వైద్య, మానసిక, అధునాతన అంశాల్లో శిక్షణతో పాటు విమాన సిమ్యులేషన్ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది."

-సీనియర్ శాస్త్రవేత్త

వైద్య శిక్షణ.. గగన్​యాన్ ప్రాజెక్టు లాంచ్ అయ్యే వరకు కొనసాగనుంది. సున్నా గురుత్వాకర్షణ శక్తి ఉన్నప్పుడు ఒత్తిడి తట్టుకోవడం కోసం మానసిక శిక్షణ ఉపయోగపడనుంది. ఇక అధునాతన శిక్షణలో భాగంగా గగన్​యాన్ వ్యవస్థల గురించి వ్యోమగాములకు పూర్తిగా అవగాహన కల్పిస్తారు.

విమాన సిమ్యులేషన్​లో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో అవసరమయ్యే భద్రతా సాధనాల ఉపయోగించడం సహా అంతరిక్షం నుంచి భూగ్రహ ఫొటోలను ఎలా తీయాలనే విషయంపైనా శిక్షణ ఇవ్వనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకోసం బెంగళూరులో కొత్త సిమ్యులేటర్లను ఇస్రో నిర్మిస్తోందని పేర్కొన్నాయి.

ఇవీ చదవండి-

ABOUT THE AUTHOR

...view details