తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నాకు ఆశలేదు-వారికి ఆ యోచన లేదు' - స్పందన

ప్రధానమంత్రి పదవిపై తనకు ఆశ లేదన్నారు కేంద్ర రవాణా శాఖమంత్రి నితిన్​ గడ్కరీ. ప్రధాని పదవి చేపట్టేందుకు ఆర్​​ఎస్​ఎస్ తనకు మద్దతుగా నిలుస్తుందన్న ఊహాగానాల్ని ఓ ముఖాముఖి వేదికగా కొట్టి పారేశారు. ​

ప్రధాని రేసులో ఉన్నాారా అన్న ప్రశ్నకు గడ్కరీ సమాధానం

By

Published : Mar 10, 2019, 4:43 PM IST

ప్రధానమంత్రి అభ్యర్థిగా భాజపా సీనియర్​ నేత, కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్​ గడ్కరీని ఆర్​ఎస్​ఎస్​ ప్రతిపాదించనుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అవన్నీ అసత్యమని పీటీఐ ముఖాముఖిలో స్పష్టంచేశారు గడ్కరీ.

ప్రశ్న: రాజకీయాల్లో అన్ని రకాల బాధ్యతలు చేపట్టినట్టున్నారు. ఇక మీ తదుపరి గమ్యం ప్రధానమంత్రి పదవేనా?

జవాబు: నాకు ప్రధానమంత్రి పదవిపై ఎలాంటి ఆశలేదు. నేను ప్రధాని రేసులో లేను. లెక్కలేసుకుని రాజకీయాలు చేసే స్వభావం నాది కాదు. అవిశ్రాంతంగా పనిచేయడమే నా విజయానికి కారణం. విధి నన్నెక్కడికి తీసుకెళితే అక్కడికి వెళ్లడమే. నాకిచ్చిన పనిని పూర్తి చేయడమే నా ప్రధాన లక్ష్యం.

ప్రశ్న: ప్రధాని అభ్యర్థిగా ఆర్​ఎస్​ఎస్ మిమ్మల్నే బలపరచనుందనే ఊహాగానాలపై మీ సమాధానం?

జవాబు: ప్రధాని అభ్యర్థిగా ఆర్​ఎస్​ఎస్ నన్ను బలపరచడానికేమీ ప్రయత్నించడం లేదు. ప్రధాని రేసులో ఉన్నానని చెప్పడంలో అర్థం లేదు. నా గురించి మీడియా, ప్రజలు ఏదైనా అనుకుంటే దానికి నేను బాధ్యుడిని కాను. ఆ ఊహాగానాలకు, నాకు సంబంధం లేదు. నేను, మా పార్టీ మోదీ వెనక ఉండి బలపరచడమే మాకు ముఖ్యం.

ప్రశ్న: రానున్న ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయని భావిస్తున్నారు?

జవాబు: మోదీ నాయకత్వంలో గతం కంటే మెరుగైన ఫలితాలే సాధిస్తాం. మహాకూటమి ఓ అనైతిక బంధం మాత్రమే. నా వద్దకు వచ్చిన ప్రతిపక్ష నేతల పనుల్ని సైతం నేను సానుకూల దృక్పథంతో చేస్తుంటాను. నేను చేయగలిగిన పనిని శక్తి వంచన లేకుండా చేసి పెడతాను.

ప్రశ్న: మీ ప్రభుత్వ పనితీరు సంతృప్తికరంగా ఉందంటారా?

జవాబు: జాతీయ ఆరోగ్య బీమా ద్వారా 10 కోట్ల కుటుంబాలకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాం. ప్రధానమంత్రి ఆవాస్​ యోజన ద్వారా 1.5 కోట్ల ఇళ్లు నిర్మించాం. కోట్ల కుటుంబాలకు కొత్తగా ఎల్​పీజీ సౌకర్యం కల్పించాం. మరో 6 కోట్ల మందికి అందించనున్నాం. మా పనితీరుతో ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు. కుంభమేళాలో పాల్గొన్న భక్తులు గత 50 ఏళ్లలో ప్రస్తుతమే గంగా నది శుభ్రంగా ప్రవహిస్తూ కనిపించిందని చెబుతున్నారు.

ప్రశ్న: మీ శాఖ పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు?

జవాబు: నేను స్వతహాగా పని రాక్షసుడిని. ఇటీవల యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ సైతం నా పనితీరుపై సానుకూల వ్యాఖ్యలు చేయడం మీరు గమనించే ఉంటారు. రవాణా సౌకర్యాల మెరగుదలకు గత ఐదేళ్లలో రూ.15 లక్షల కోట్లు విలువైన పనులు చేశాం. ప్రస్తుత పదవీకాలంలో చేయలేని కొన్ని పనులు మిగిలిపోయాయి. ఎవ్వరూ సంపూర్ణులు కాదు. ప్రతీ ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయడమే కావలసింది.

ప్రశ్న: మీకున్న ఇతర ప్రాథమ్యాలు?

జవాబు: నాకు అత్యంత ఆసక్తికర అంశం జీవ ఆధారిత ఇంధనం. రానున్న కాలంలో జీవ ఆధారిత ఇంధనానికి మార్కెట్ పెరగబోతోంది. వెదురుకర్రల నుంచి ఇంధనాన్ని తయారుచేయవచ్చని ఇండియన్ ఇన్స్​టిట్యూట్, దెహ్రాదూన్​ వారు నిరూపించారు. ఇది వాడకంలోకి వస్తే రూ. 30,000కోట్ల ఇంధన వ్యయం తగ్గే అవకాశం ఉంది.

ప్రశ్న: ప్రస్తుత రాజకీయాలపై మీ అభిప్రాయం?

జవాబు: రాజకీయాలు, క్రికెట్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. వివిధ రకాల ఒత్తిళ్లు, పరిమితుల మధ్య పనిచేయవలసి ఉంటుంది.

ఇదీ చూడండి:"ఖబడ్దార్​.. చూస్తూ ఊరుకోం"

ABOUT THE AUTHOR

...view details