జపాన్‌లో ప్రవాస భారతీయులతో మోదీ మాటామంతి జపాన్ పర్యటనలో భాగంగా కోబే నగరంలో ప్రవాస భారతీయులతో మాటామంతి కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమైనందుకు ఆనందంగా ఉందన్నారు. ఓటు హక్కు వినియోగించుకుని నవ భారత్ నిర్మాణంలో భాగస్వాములైనందుకు ప్రవాస భారతీయులకు కృతజ్ఞతలు తెలిపారు మోదీ. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ గల భారత్‌లో 61కోట్ల మంది ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు.
కారు నుంచి బుల్లెట్ రైలు వరకు..
భారత్-జపాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దృఢమైనందుకు హర్షం వ్యక్తం చేశారు మోదీ. కార్ల తయారీకి పరస్పర సహకారం అందించుకునే స్థాయి నుంచి బుల్లెట్ రైళ్లు రూపొందించే స్థాయికి చేరుకున్నామన్నారు. ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాల్లో జపాన్‌ది ప్రత్యేక స్థానమన్నారు మోదీ.
దాదాపు రెండు దశాబ్దాల క్రితం అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ, అప్పటి జపాన్ ప్రధాని యోశిరో మోరిలు ఇరుదేశాల మధ్య బంధాన్ని పెంపొందించేందుకు కృషి చేశారన్నారు మోదీ.
ఈసారి భారత్‌లో 61కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని, ఇది చైనా మినహా ప్రపంచంలోని అన్ని దేశాల జనాభాతో పోలిస్తే అధికమని గుర్తు చేశారు ప్రధాని.