కర్ణాటక కలబుర్గిలో తన పిల్లలను పోషించుకునేందుకు రొట్టెల కేంద్రాన్ని స్థాపించి.. నేడు 150 మందికిపైగా మహిళలకు ఉపాధి కల్పిస్తోంది మహాదేవి. కేవలం వందల రూపాయల మూలధనం, కష్టమే పెట్టుబడిగా ఒక్కో మెట్టు అధిరోహించి.. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది మహాదేవి. మహిళా దినోత్సవం రోజున.. ఆమె జీవితంలో ఎదుర్కొన్న ఒడుదొడుకులను తెలుసుకుందాం.
కష్టాలను ఓడిచింది..
కలబుర్గిలోని మానికేశ్వరీ కాలనీకి చెందిన మహాదేవి.. కొన్నేళ్ల క్రితం కష్టాల ఊబిలో కొట్టుమిట్టాడింది. ఇద్దరు పిల్లలతో ఒంటరిగా బతకడం చాలా కష్టమని సమాజం ఆమెను భయపెట్టింది. ఒక దశలో ఆమె జీవితం ముగిసిపోయిందని వెక్కిరించింది. కానీ.. ఆమె వెనకడుగు వేయలేదు. చివరి ప్రయత్నంగా తన దగ్గరున్న కొంత డబ్బుతో రొట్టెల వ్యాపారం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగింది. 'ఖానావళి' అనే మెస్‌ను సైతం ప్రారంభించింది. స్త్రీ తలచుకుంటే.. చేయలేనిది ఏదీ లేదని నిరూపించింది.
"32 ఏళ్లుగా నేను ఈ వ్యాపారం చేస్తున్నా. మొదట్లో తొమ్మిదేళ్ల వరకు నేనొక్కదాన్నే చేశాను. ఆ తరువాత కస్టమర్లు పెరిగారు. ఇప్పుడు 150 మంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. నేను ఈ వ్యాపారం ప్రారంభించినప్పుడు ఈ ప్రాంతంలో రొట్టె కేంద్రాలు లేవు. మా వల్లే ఇక్కిడివారికి రొట్టెలు పరిచయమయ్యాయి. విద్యార్థులకు, పేదవారికి రూపాయి, రెండు రూపాయలకే రొట్టెలు విక్రయిస్తాం. మేము రోజుకు కనీసం 10 వేల చపాతీలు తయారు చేస్తాం. ఆర్డర్లు వస్తే పెళ్లిళ్లు, పేరంటాలకూ పంపిస్తాం."