జైషే మహ్మద్ ఉగ్రసంస్థ అధినేత మసూద్ ఆజార్‌కు షాకిచ్చేందుకు సిద్ధమైంది ఫ్రాన్స్. ఆజార్పై ఆర్థిక పరమైన ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. మొదట్నుంచి భారత్‌కు మద్దతుగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలుస్తోంది ఫ్రాన్స్.
మసూద్‌కు ఎదురు దెబ్బ
జైషే ఉగ్రసంస్థ అధినేత మసూద్ అజార్‌కు ఫ్రాన్స్ గట్టి షాక్ ఇచ్చింది. మసూద్‌పై ఆర్థికపరమైన ఆంక్షలను విధించేందుకు సిద్ధమైంది.
గతనెల 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40కి పైగా భారత జవాన్లు అమరులయ్యారు. దాడికి పాల్పడింది తామేనని జైషే ప్రకటించింది. ఈ ఘటనతో మసూద్‌ను అంతర్జాతీయం ఉగ్రవాదిగా గుర్తించాలని భారత్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.ఈ తరుణంలో మసూద్‌ను ఆంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని అమెరికా, బ్రిటన్లతో కలిసి ఫ్రాన్స్ ఐరాస భద్రతా మండలిలో ప్రతిపాదనను ఉంచింది. అయితే చైనా వక్ర బుద్ధితో తన వీటో అధికారాన్ని ఉపయోగించి ప్రతిపాదనకు అడ్డుపడింది.
" ఫ్రాన్స్ ఎప్పటికీ భారత్‌కు మద్దతుగా ఉంటుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది"- ఫ్రాన్స్ విదేశాంగ శాఖ ప్రకటన