వివాదాస్పద అంశాలపై ఒక్కొక్కటిగా నిర్ణయాలు తీసుకుంటున్న మోదీ ప్రభుత్వం మరో నాలుగు కీలక విషయాలపై దృష్టి సారించింది. 370 అధికరణం రద్దు, ముమ్మారు తలాక్ రద్దు తర్వాత తాజాగా పౌరసత్వం సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. రాజ్యసభలో తగిన సంఖ్యాబలం లేనప్పటికీ వీటిపై నిర్ణయాలు తీసుకోగలగడం గమనార్హం.
భాజపా వర్గాల సమాచారం ప్రకారం తొలుత ఎన్‌ఆర్‌సీపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఇందుకు పార్లమెంటులో ఎలాంటి చట్టం చేయాల్సిన అవసరం లేదు. మంత్రివర్గంలో చర్చించి ఉత్తర్వులు ఇస్తే సరిపోతుంది.
అన్ని మతాల వారికీ ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫార్మ్ సివిల్ కోడ్-యూసీసీ)ని రూపొందించాలన్నది ప్రభుత్వం ముందున్న మరో ప్రాధాన్య అంశం. దీనిపై జైనులు, పార్శీల వంటి మైనార్టీల నుంచి అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో ముందుగా వారి విశ్వాసాన్ని పొందే ప్రయత్నాలు చేయనుంది.
జమిలి ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉండడంతో ఈ లక్ష్య సాధనకు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది. తొలుత ప్రతిపక్షాల అనుమానాలు తీర్చి వారి మద్దతు పొందాల్సి ఉంది.
జనాభా నియంత్రణకూ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. వనరుల లభ్యత తగ్గుతున్న దృష్ట్యా జనాభాను అదుపు చేయాల్సి ఉందని, ఇది ఏ ఒక్క మతానికో చేపట్టే కార్యక్రమం కాదంటూ ప్రతిపక్షాలకు నచ్చజెప్పనుంది.