ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించే మసీదు నమూనాను ఈ శనివారం(డిసెంబర్ 19న) విడుదల చేయనున్నట్లు ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్) ట్రస్టు ప్రకటించింది. మసీదు నిర్మాణానికి ధన్నీపుర్లో కేటాయించిన 5 ఎకరాల స్థలంలో.. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన గణతంత్ర దినోత్సవం రోజున శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపింది.
మసీదు నిర్మాణం కోసం.. గతంలో 15 మంది సభ్యులతో ఐఐసీఎఫ్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది సున్నీ వక్ఫ్ బోర్డు. మసీదు ప్రాంగణంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, ప్రజా గ్రంథాలయం, ఇండో-ఇస్లామిక్ వారసత్వ సంపద కేంద్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించింది.
ఒకేసారి 2 వేల మంది నమాజ్..
జామియా మిల్లియా విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ విభాగాధిపతి ఎస్ఎం అక్తర్.. ఈ మసీదు రూపకర్తగా ఉన్నారు. ఆయన నమూనాను ఖరారు చేశారు. ఒకేసారి 2 వేల మంది నమాజ్ చేసుకునేలా మసీదును రూపొందించనున్నట్లు అక్తర్ తెలిపారు. నిర్మాణం వలయాకారంలో ఉంటుందని ఆయన వెల్లడించారు. అయితే.. ఇది బాబ్రీ మసీదు కంటే పెద్దగా ఉంటుందని స్పష్టం చేశారు.