తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జైట్లీ మార్క్​ రాజకీయం... విద్యార్థి దశ నుంచే... - అరుణ్​ జైట్లీ

భాజపా సీనియర్​ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్​ జైట్లీ చిన్నప్పటి నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన జైట్లీ... మునుపటి మోదీ సర్కార్​లో ఆర్థిక మంత్రిగా కీలక పాత్ర పోషించారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన తుదిశ్వాస విడిచారు.

జైట్లీ మార్క్​ రాజకీయం... విద్యార్థి దశ నుంచే...

By

Published : Aug 24, 2019, 12:49 PM IST

Updated : Sep 28, 2019, 2:36 AM IST

జైట్లీ మార్క్​ రాజకీయం... విద్యార్థి దశ నుంచే...

అరుణ్​జైట్లీ 1952 డిసెంబర్​​ 28న పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి.. మహారాజ్​ కిషన్​ జైట్లీ ప్రముఖ న్యాయవాది. ​జైట్లీ.. దిల్లీ నుంచే డిగ్రీ, న్యాయశాస్త్ర పట్టా పొందారు. దిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న సమయంలో... విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించారు.

రాజకీయాల్లోకి రాకముందు జైట్లీ సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్​ చేశారు. ఆయనను సీనియర్​ న్యాయవాదిగా దిల్లీ హైకోర్టు గుర్తించింది.

విద్యార్థి దశలోనే...

అరుణ్ జైట్లీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నాయకుడుగా పనిచేశారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో జైట్లీ చురుగ్గా పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన యువ మోర్చా కన్వీనర్. పోరాటంలో పాల్గొన్నందుకు జైట్లీ అంబాలా, తీహార్​ జైలులో 19 నెలలు ఉన్నారు. విడుదలయ్యాక జనసంఘ్‌లో చేరారు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వంలో అరుణ్ జైట్లీ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు.

1991 నుంచి భారతీయ జనతా పార్టీ కార్యవర్గంలో పనిచేస్తున్నారు. వాజ్​పేయీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో పలు మంత్రిత్వ శాఖల్లో పనిచేశారు. వివిధ రాష్ట్రాల్లో భాజపా ఎన్నికల బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించారు. 2014 సార్వత్రికంలో మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో అమృత్‌సర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి... కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. మోదీ తొలి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు.

ఆర్థిక మంత్రిగా మంచి గుర్తింపు...

మోదీ-1 ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక, రక్షణ, కార్పొరేట్​ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రభుత్వంలో వివాద పరిష్కర్తగా గుర్తింపు పొందారు. అనారోగ్యం కారణంతో ఆయన 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. గత ఏడాది మే నెలలో ఆయనకు మూత్రపిండాల మార్పిడి జరిగింది. దీంతో కొంతకాలంపాటు ఆయన స్థానంలో పీయూష్‌ గోయల్‌ ఆర్థిక మంత్రిత్వశాఖను నిర్వహించారు. దీర్ఘకాల మధుమేహం కారణంగా పెరిగిన శరీర బరువును తగ్గించుకోవడానికి 2014లో ఆయన బేరియాట్రిక్‌ శస్త్రచికిత్స చేయించుకున్నారు.

2019 ఎన్నికల అనంతరం.. అనారోగ్యం కారణంగా మంత్రిత్వ పదవులకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు జైట్లీ. ఈ మేరకు నూతన ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగలేనని ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆ తర్వాత అడపాదడపా ప్రభుత్వ నిర్ణయాలపై.. విపక్షాల ఆరోపణలపైనా ట్విట్టర్​, ఫేస్​బుక్​, తన సొంత బ్లాగ్​లలో స్పందిస్తూ వచ్చారు.

Last Updated : Sep 28, 2019, 2:36 AM IST

ABOUT THE AUTHOR

...view details