తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీది విధ్వంస పాలన: మాజీ ప్రధాని మన్మోహన్​

ఐదేళ్ల భాజపా పాలనలో దేశంలోని అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయని అన్నారు మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, వ్యవసాయం, ఆర్థిక రంగాలు విధ్వంసం అయ్యాయని ఆరోపించారు. ఐదేళ్ల భాజపా పాలన, జాతీయ భద్రత, ఆర్థిక రంగం తదితర అంశాలపై వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ముఖాముఖిలో అభిప్రాయాలను వెల్లడించారు మన్మోహన్​​.

By

Published : May 5, 2019, 11:36 PM IST

Updated : May 5, 2019, 11:44 PM IST

మోదీది విధ్వంస పాలన : మాజీ ప్రధాని మన్మోహన్​

భాజపా పాలనపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్​ సింగ్​. మోదీ హయాంలో దేశంలోని అన్ని రంగాలు సంక్షోభంలో కూరుపోయాయని విమర్శించారు. నోట్ల రద్దు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. భాజపా పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు మన్మోహన్​.

ఐదేళ్లుగా దేశంలో వ్యవసాయం, ఆర్థిక రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయని అన్నారు. భాజపాను ఓడించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు. భాజపా పాలనలో అవినీతి తారస్థాయికి చేరుకుందని ఆరోపించారు మన్మోహన్​.

నోట్ల రద్దుపై..

నోట్ల రద్దు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు మన్మోహన్​ సింగ్​. మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ దారుణ స్థితిలో ఉందన్నారు. ప్రధాని వాక్చాతుర్యంతో ప్రజలు విసుగు చెందారని చెప్పారు. మార్పును దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

పాకిస్థాన్​పై మోదీది ఉదాసీన వైఖరి

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో జాతీయవాదం, ఉగ్రవాదం అంశాలనుభాజపాఎక్కువగా ప్రస్తావించడంపైనా విమర్శలు చేశారు మన్మోహన్​. పుల్వామా ఉగ్రదాడి జరిగిన వెంటనే జాతీయ భద్రతా కమిటీ సమావేశం ఏర్పాటు చేయాల్సింది పోయి.. జిమ్​ కార్బెట్​ జాతీయ పార్కులో చిత్రీకరణలో మోదీ పాల్గొన్నారని ఎద్దేవా చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటంలో నిఘావర్గాలు విఫలయ్యాయని ఆరోపించారు. పాకిస్థాన్​పై ప్రధాని మోదీవి నిర్లక్ష్యపు, ఉదాసీన విధానాలని విమర్శించారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజమైపోదని హితవు పలికారు. మోదీ పాలనలో ఉగ్రదాడులు, సరిహద్దుల వెంబడి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు పెరిగిపోయాయన్నారు మన్మోహన్​.

విభజన, ద్వేషం భాజపా పర్యాయపదాలు

వేర్పాటువాదం, ద్వేషం భారతీయ జనతా పార్టీకి పర్యాయ పదాలని ఆరోపించారు మాజీ ప్రధాని మన్మోహన్. భాజపా నేతలకు దేశాభివృద్ధి పట్టడం లేదన్నారు. కేవలం రాజకీయంగా ఎదిగేందుకే వెంపర్లాడుతున్నారని ఆరోపించారు. అలాంటి వారికి వెంటనే నిష్క్రమణ ద్వారం చూపాలన్నారు మన్మోహన్​.

మోదీ పాలన.. వైఫల్యాల కథ

ఐదేళ్లలో పరిపాలన, జవాబుదారీతనం విషయాల్లోమోదీపూర్తిగా విఫలమయ్యారని మన్మోహన్​ విమర్శించారు. 2014లో అచ్చేదిన్​ (మంచిరోజులు) తీసుకొస్తామని హామీ ఇచ్చి.. మోదీ అధికారంలోకి వచ్చారన్నారు. కానీ ఆయన ఐదేళ్ల పాలన అత్యంత బాధాకరం, విధ్వంసకరంగా ముగుస్తోందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వాన్ని, భాజపాను ప్రజలు తిరస్కరించాలని నిర్ణయించుకున్నారని తెలిపారు మన్మోహన్​. భాజపా ఓటమి చెందితేనే దేశ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందన్నారు.

ఒకే వ్యక్తి నిర్ణయాలు సరికాదు

భారత్​ లాంటి వైవిధ్యమైన దేశంలో 'ఒక వ్యక్తి' ఆలోచనా ప్రక్రియ, సంకల్పంతో ప్రజల ఆకాంక్షలు, ఆశలకు న్యాయం జరగదన్నారు మన్మోహన్​. 130 కోట్ల ప్రజల సమస్యలను ఒక వ్యక్తే తీర్చలేరని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: "యూపీఏలో రాహుల్​ సంస్థకు జలాంతర్గామి ఒప్పందం"

Last Updated : May 5, 2019, 11:44 PM IST

ABOUT THE AUTHOR

...view details