కర్ణాటకలో వరద బీభత్సానికి మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 31కి చేరుకుంది. మరో 14 మంది ఆచూకీ గల్లంతైంది.
కర్ణాటక వరదల్లో 31కి చేరిన మృతుల సంఖ్య పునరావాసం
రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని 3.14 లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో 2.18 లక్షల మంది 924 పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.
శనివారం 17 జిల్లాల్లోని 80 తాలూకాలను వరద ప్రభావిత ప్రాంతాలుగా కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో సహాయక, పునరావాస చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.
నీటమునిగిన లక్షల హెక్టార్లు
భారీ వర్షాలు, వరదల ధాటికి బెళగావి, బాఘల్కోట్ జిల్లాల్లో సుమారు 21,431 ఇళ్లు, 4.16 లక్షల హెక్టార్ల మేర పంటలు నీటమునిగాయని ప్రభుత్వం అంచనా వేసింది.
కొండచరియలు విరిగిపడి..
భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన కారణంగా బెంగళూరు, మంగళూరులను కలిపే జాతీయ రహదారి మూసుకుపోయింది. సోమవారం వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అధికారులు చెబుతున్నారు.
శాంతిస్తున్న నేత్రావతి
దక్షిణ కన్నడ జిల్లాలోని ఉప్పొంగి ప్రవహిస్తున్న నేత్రావతి నదిలో వరద స్థాయి తగ్గుముఖం పడుతోందని అధికారులు తెలిపారు. బెంట్వాళలో నీటి మట్టం 11 మీటర్ల నుంచి 9.1 మీటర్లకు తగ్గింది. ఇదే ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న కాంగ్రెస్ నేత జనార్ధన పూజారిని విపత్తు నిర్వహణ దళాలు సురక్షిత ప్రాంతానికి చేర్చాయి.
పొంగి పొర్లుతున్న తుంగభద్ర
తుంగభద్ర నదీ ప్రవాహ ఉద్ధృతికి బళ్లారి హంపి కోటకు సమీపంలోని వంతెన నీటమునిగింది. ఫలితంగా కంప్లి, గంగావతి పట్టణాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
అమిత్షా ఏరియల్ సర్వే
బెళగావి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర హోంమంత్రి అమిషా విహంగవీక్షణం చేయనున్నారు. ఆయనతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కూడా పాల్గొంటారు. ఇప్పటికే ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఈ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు.
"నేను బెళగావి వెళ్తున్నాను. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్షా కూడా అక్కడకు చేరుకుంటారు. మేమిద్దరం కలసి బెళగావి, బాఘల్కోట్ తదితర ప్రాంతాల్లో విహంగవీక్షణం చేస్తాం."-యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి.
ఇదీ చూడండి: నేడు చైనాకు జయ్శంకర్.. 3 రోజుల పర్యటన