కుండపోత వర్షాల ధాటికి పలు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్లలో లోతట్టు ప్రాంతాలు జలమయ్యమయ్యాయి. శుక్రవారం నుంచి కురుస్తున్న వర్షాలతో ఇప్పటివరకు 114 మంది మరణించారు. వరదల్లో చిక్కుకొని మరికొందరు గల్లంతయ్యారు. పలు జలాశయాల్లో నీటిమట్టం గరిష్ఠస్థాయులకు చేరిన కారణంగా గేట్లు ఎత్తివేస్తున్నారు.
కేరళలో వర్షం జోరు...
కేరళలో వర్షాలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా రెండు రోజుల్లో ఇక్కడ 57 మంది మృతిచెందారు. లక్షా 65 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్టవ్యాప్తంగా 13 వందల పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు ముఖ్యమంత్రి పినరయి విజయన్.
ఇప్పటికీ పలు ప్రాంతాల్లో వరద నీరు అలాగే నిలిచి ఉంది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం కలిగింది. కొట్టాయంలో పలు గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. కోచి విమానశ్రయంలో శనివారం అంతర్జాతీయ విమాన సేవలు నిలిచిపోయాయి. 23 రైలు సర్వీసులకు ఆటంకం ఏర్పడింది.
వయనాడ్, కన్నూర్, కసారగోడ్లలో ఆదివారం కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇదీ చూడండి:జలప్రళయంలో చిక్కుకున్న దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలు
వయనాడ్కు రాహుల్...
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న కేరళలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేడు పర్యటించే అవకాశముంది. వయనాడ్ సహా కోజికోడ్, మలప్పురంలో ఆయన పర్యటించనున్నట్లు తెలిపాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. సహాయక చర్యలకు ఆటంకం కలిగించబోనన్న రాహుల్.. అక్కడ రెండు రోజులు ఉండనున్నట్లు దిల్లీలో మీడియాతో తెలిపారు. బాధితులకు సహాయార్థం ప్రధాని, కేరళ సీఎం, కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడినట్లు పేర్కొన్నారు.